kadiyapulanka
-
పండగ ఏదైనా.. పచ్చనికానుక.. ఇప్పుడిదే ట్రెండ్
రామకృష్ణ రిటైర్డ్ బ్యాంకు అధికారి. కుమార్తెకు వివాహం కుదిరింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అతిథులకు, వియ్యాలవారికి రిటర్న్ గిఫ్ట్ కొత్తగా ఏదైనా ఇవ్వాలని ఆయన ఆలోచన. రోజూ సాయంత్రం వాకింగ్‌లో కలిసే మిత్రుడిని సలహా అడిగారు. ఆకర్షణీయమైన మొక్కలను ఇద్దామని సూచించారు. అది రామకృష్ణకు నచ్చింది. వెంటనే కడియపులంక నుంచి తెప్పించి, వాటినే బహూకరించారు. (రాజమహేంద్రవరం డెస్క్) : రామకృష్ణ ఒక్కరే కాదు. ఇటీవల కాలంలో చాలామంది పర్యావరణ హితం కోరుతూ బహుమతుల జాబితాలో మొక్కలను చేరుస్తున్నారు. జీవం ఉన్న బుల్లి మొక్కలను బహుమతిగా ఇస్తూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. పూలదండలు, పుష్పగుచ్ఛాల స్థానాన్ని క్రమంగా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ప్లాంట్స్ ఆక్రమిస్తున్నాయి. పెద్ద నాయకులు పర్యటనకు వచ్చినా, ఓ ఉద్యోగి రిటైరైనా శాలువా, మెమెంటోలతో పాటు గిఫ్ట్ ప్లాంట్లు కూడా తప్పనిసరి అయ్యాయి. కాన్వెంట్లో విద్యార్థి పుట్టిన రోజు నాడు క్లాస్ టీచర్లకు తల్లిదండ్రులు మొక్కలనే పిల్లలతో గిఫ్ట్‌గా ఇప్పిస్తున్నారు. అదొక్కటే కాదు పచ్చదనాన్ని ఇష్టపడే ఏ ఇంటి హాల్లో టీపాయ్‌పైన చూసినా ఒకటో, రెండో గిఫ్ట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. మొక్కలు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయని, ఎయిర్ ప్యూరిఫయర్‌గా ఉపయోగపడతాయని ఇలా చేస్తున్నారు. ఇదో పెద్ద పరిశ్రమ గిఫ్ట్ ప్లాంట్స్ ..ఇప్పుడో పెద్ద పరిశ్రమ. దీనికి కేరాఫ్ రాష్ట్రంలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ కడియం, కడియపులంక. 15 ఏళ్ల క్రితం గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మొదలయ్యాయి. స్వల్పకాలంలోనే నర్సరీ రంగంలో ఓ ప్రత్యేక విభాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి . ప్రస్తుతం వాటి టర్నోవర్ రూ.కోట్లలోకి చేరుకుంది. జామియా కులకస్, పొట్టి రకానికి చెందిన స్నేక్, రంగురంగుల అగ్లోనిమాలు, మెరంటా, సింగోనియం, సక్కలెన్స్ వంటి మొక్కలు గిఫ్ట్ ప్లాంట్స్‌గా ఆదరణ పొందాయి. పీస్ లిల్లీ, ఆంథూరియం, కలించీ, ఆర్చిడ్స్ వంటివి పూలతో కూడి న గిఫ్ట్ ప్లాంట్స్. వాటిలో ఆక్సిజన్ ప్లాంట్‌గా పిలిచే జామియా కులకస్ ఎక్కువగా అమ్ముడయ్యే గిఫ్ట్ప్లాంట్. వీటిని పూణె, బెంగళూరుల నుంచే గాకుండా థాయ్‌లాండ్, చైనా వంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ నర్సరీల యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. గిఫ్ట్ప్లాంట్స్ చిన్నవి, సున్నితమైనవి కావడంతో ఎండవానల నుంచి రక్షణకు పాలీహౌస్‌లలో విక్రయానికి ఉంచుతారు. వాటి కోసం పెద్దపెద్ద నర్సరీల యాజమానులు రూ.లక్షలు ఖర్చు చేసి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కడియపులంక ప్రాంతంలో 40 వరకూ పాలీహౌస్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలకు సరఫరా అవుతుంటాయి. ఒక్కోగిఫ్ట్ ప్లాంట్ రకాన్ని బట్టి ఇంచుమించు రూ.250 నుంచి రూ.1000 వరకూ రేటు పలుకుతోంది. వెలెన్షియాలు.. సాధారణంగా 4, 5, 6 అంగుళాల సాధారణ కుండీల్లో గిఫ్ట్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. మట్టికి బదులు పోషకాలు ఎక్కువగా ఉండే పాట్ మిక్స్ వాడుతుంటారు. మొక్కలతో కూడిన ఆ కుండీలను అంతకంటే అర అంగుళం ఎక్కువ సైజులో వివిధ రంగుల్లో, ఆకర్షణీయంగా ఉండే మరో కుండీలో ఉంచుతారు. దానిని వ్యవహారికంగా అవుటర్ పాట్ అంటారు. అసలు పేరు వెలెన్షియా.ప్లాస్టిక్ కుండీలు, గార్డెన్ ఉపకరణాలు తయారు చేసే పెద్దపెద్ద కంపెనీలే వివిధ రూపాల్లో, డిజైన్లలో ఆకట్టుకునేలా ఈ వెలెన్షియాలను తయారు చేస్తున్నాయి. వీటి అవుట్లెట్లు కడియపులంక ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో కీలకం నూతన సంవత్సర వేడుకలకు ఆతీ్మయులకు గిఫ్ట్ ప్లాంట్స్‌ను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. కడియం,కడియపులంకల్లో ఏడాది పొడవునా సాగే విక్రయాయి ఒక ఎత్తయితే, న్యూ ఇయర్ పేరుతో జరిగే గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మరో ఎత్తు. ఈ క్రమంలో డిసెంబర్ మూడో వారం నుంచి కడియం, కడియపులంకలలోని ప్రధాన నర్సరీల యజమానులు ఏటా సరికొత్త రకాల గిఫ్ట్ ప్లాంట్స్‌ను దిగుమతి చేసుకుంటారు. డిసెంబర్ కావడంతో వాటిలో వివిధ రకాల స్వదేశీ, విదేశీ రకాల పూలమొక్కలు కూడా ఉంటాయి. డిసెంబర్ ఆఖరి వారంలోనే రూ.కోట్లలో గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు జరుగుతాయి. గిఫ్ట్ ప్లాంట్‌తో స్వాగతం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో సందర్శనకు తరచూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారికి గతంలో పుష్పగుచ్ఛా లను ఇచ్చి స్వాగతం పలికేవారం. వాటికి బదులు కొంతకాలంగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇచ్చి ఆహా్వనిస్తున్నాం. పుష్పగుచ్ఛాలు రెండు రోజులకే వాడిపోతాయి. గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ కాల ఉంటా యి. ఆక్సిజన్‌ను ఇస్తాయి. పర్యావరణ రక్షణకు మేం కూడా ఎంతో కొంత మేలు చేసినట్టూ ఉంటుంది. – వీఎస్ఎల్ రావు, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, రాజమహేంద్రవరం డిపో 12 ఏళ్లుగా విక్రయిస్తున్నాం కడియపులంకలో 12 ఏళ్లుగా గార్డెన్ ఉపకరణాలు విక్రయిస్తున్నాం. ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు వెలెన్షియాల విక్రయాలు బాగా పెరిగాయి. అన్ని సైజుల్లో, రంగుల్లో మా వద్ద అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాలు, పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతుంటారు. – రాజ్‌కుమార్ పాండే, మేనేజర్, హర్ష్ దీప్, గార్డెన్ ఉపకరణాల అవుట్లెట్, కడియపులంక సబ్సిడీపై పాట్ మిక్స్ ఇవ్వాలి రాష్ట్రంలోనే అతిపెద్ద గిఫ్ట్ ప్లాంట్ మార్కెట్‌గా కడియం, కడియపు ఎదిగాయి. గిఫ్ట్ఫ్లాంట్స్ ఆక్సిజన్‌ను ఇవ్వడమే కాదు, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ కూడా. వాటిని విక్రయించే నర్సరీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం. ప్రధానంగా ఉద్యాన శాఖ ద్వారా మట్టికి బదులుగా గిఫ్ట్ ప్లాంట్‌కు వినియోగించే పాట్ మిక్స్‌ను రాయితీపై ఇచ్చి ప్రోత్సహించాలి. – మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ అధినేత, కడియపులంక -
పాపం సాయి.. ఉద్యోగావకాశం వదులుకుని అమెరికా వెళ్తే...
కడియం: యూఎస్‌లో పెద్ద చదువు చదివి ఉన్నత స్థితికి చేరుకుంటాడని పంపిన బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాసు (వాసు), సుశీల దంపతుల కుమారుడు సాయినరసింహ (25). చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది బీటెక్ చదివాడు. యూఎస్‌లో ఎంఎస్ చదవాలనేది సాయినరసింహ ఆకాంక్ష. ఇదే విషయాన్ని తలిదండ్రుల వద్ద వ్యక్తం చేశాడు. దీనికి వారు అంగీకరించి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న యాఎస్లోని కనెక్టికట్ స్టేట్ పరిధిలోని న్యూ హెవెన్స్ యూనివర్శిటీకి పంపించారు. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదివే అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. బుర్రిలంకకు చెందిన సిద్దిరెడ్డి సత్తిబాబు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే చదువుతోంది. సెలవులు కావడంతో మంగళవారం సాయినరసింహ, ఐశ్వర్య, మరో అయిదుగురు స్నేహితులు కలిసి సమీపంలోని విలేజ్‌ను సందర్శించేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ గంటన్నరకే మరో మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతో పాటు, మరో ఇద్దరు మృతి చెందారు. ఐశ్వర్య గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరసింహ సోదరి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మృతదేహం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు సాయి నరసింహ మృతి చెందినట్టు తెలియడంతో బుర్రిలంకలో విషాద వాతావరణం నెలకొంది. యూఎస్ వెళ్లిన మూడు నెలలకే మృత్యు ఒడికి చేరడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి తండ్రి శ్రీనివాసు (వాసు) నర్సరీ రైతుగా అందరికీ తలలోనాలుకగా ఉంటారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తోడ్పాటు అందిస్తుంటారు. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తులు వాసు ఇంటికి చేరుకున్నారు. అమెరికా పంపడం తమ శక్తికి మించినదే అయినప్పటికీ బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పంపించామంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీటెక్ చేస్తుండగా ఉద్యోగావకాశం వచ్చినా ఎంఎస్ చదువుతానని వెళ్లి మృత్యు ఒడికి చేరాడని రోదిస్తున్నారు. యూఎస్ ప్రయాణానికి ముందు కుమారుడితో కలిసి తిరుమల వెళ్లామని చివరి క్షణాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే విషయంలో ఎంపీ భరత్‌రామ్ దృష్టికి తీసుకువెళ్లారు. శనివారానికి మృతదేహం బుర్రిలంకకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. (క్లిక్: అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!) -
మురళీమోహన్‌కు చేదు అనుభవం
కడియం, (రాజమహేంద్రవరం రూరల్) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శుక్రవారం ప్రచారం చేపట్టిన ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు జనం నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమకు నాలుగున్నరేళ్లుగా రోడ్డు సమస్య ఉందని, పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు మా వీధిలోకి ఎలా వస్తారంటూ కడియపులంక కొబ్బరితోట కాలనీ, పల్లాలమ్మ గుడివీధికి చెందిన ప్రజలు అడ్డుకున్నారు. తమ వాహనాలను రోడ్డుకు అడ్డుగా పెట్టి వీధిలోకి రావద్దంటూ నిలబడ్డారు. మాజీ సర్పంచి భర్త వార రాము, ఎంపీటీసీ భర్త బోడపాటి గోపీలు అక్కడికి చేరుకుని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మీరు ఓట్లు వేస్తే ఎంత? వేయకపోతే ఎంత? అంటూ టీడీపీ నేతలు వాదనకు దిగారు. ప్రచార రథంపై ఉన్న గోరంట్ల.. ‘వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. పోనీయవయ్యా.. ఎవడాపుతాడో చూస్తా..’ అంటూ ప్రచార రథాన్ని ముందుకు కదిలించారు. -
అమ్మో అమెరికా దోమ
అమలాపురం: ఖండాంతరాలు దాటి కడియపు లంకకు చేరుకున్న శత్రువు పచ్చని గోదారి జిల్లాలను పీల్చి పిప్పి చేస్తోంది. ఎటు చూసినా పచ్చని పైర్లు, పండ్ల తోటలు, నర్సరీలతో అలరారే ఉభయగోదావరి జిల్లాలు ఈ శత్రువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు.. తరువాత కడియం నర్సరీలకు..అక్కడ నుంచి క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది రూగోస్ వైట్ఫ్లై (వలయాకారపు తెల్లదోమ). తొలుత నర్సరీల్లోని మొక్కలకు.. తరువాత కొబ్బరి.. ఆయిల్ పామ్.. తాజాగా అరటి, మామిడి, జీడిమామిడి, సీతాఫలం, సపోటా, పనస..ఇలా అన్ని రకాల పంటలను ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేరళ, తమిళనాడు కొబ్బరి రైతులకు వలయాకార తెల్లదోమ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అక్కడ దిగుబడి 40 శాతం వరకు పడిపోయింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఈ దోమ ఉధృతికి తోడు వర్షాలు లేక వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయి. మూడేళ్ల క్రితం దీని జాడ కనిపించినా ఇప్పటికీ ఉధృతి తగ్గలేదు. మన రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న కొబ్బరి మొక్కల ద్వారా ఇది వ్యాపించింది. తరువాత కడియం నర్సరీకి వ్యాపించింది. నర్సరీ మొక్కల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దీని ఉధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి 1.78 లక్షల ఎకరాల్లోను, ఆయిల్‌పామ్ 98 వేల ఎకరాలు, అరటి 74 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక కడియం, పరిసర ప్రాంతాల్లో 14 వేల 500 ఎకరాల్లో పూలు, పూలమొక్కలు, ఆర్నమెంట్ సాగు చేస్తున్నారు. దిగుబడిపై పెనుప్రభావం... కొబ్బరి, ఆయిల్ పామ్ దీర్ఘకాలిక పంటలు. అరటి కార్సి తోట పంట కావడం వల్ల మూడేళ్లపాటు రైతులకు ఆదాయాన్నిస్తోంది. ఈ పంటలను తెల్లదోమ ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. నర్సరీ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గడచిన రెండేళ్లుగా తెల్లదోమ వల్ల సుమారు 30 శాతం విక్రయాలు తగ్గిపోయాయని నర్సరీ రైతులు చెబుతున్నారు. మొక్క ఆకుల దిగువు భాగాన్ని ఈ తెల్లదోమ అశిస్తోంది. ఇది వదిలే వ్యర్థం ఆకు ఎగువ భాగంలో దట్టమైన నల్లని పొర రూపంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఆకుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు బలహీనంగా మారి దిగుబడి పడిపోతోంది. వాతావరణంలో తేమ పెరిగే కొద్దీ ఇది శరవేగంగా విస్తరిస్తోంది. చేతులెత్తేసిన అధికారులు.. తెల్లదోమ నిర్మూలన విషయంలో ఉద్యాన శాఖ అధికారులు చేతులెత్తేశారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దీన్ని నివారించేందుకు కొంతవరకు చర్యలు చేపట్టారు. గతంలో కడియం మొక్కలను గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారు. తెల్లదోమను అరికట్టేందుకు ఎల్లోస్టిక్స్ (పసుపురంగు అట్టలు), ఎన్కార్సియా గ్వడెలోపే, ఎన్కార్సియా డిస్‌పెర్సా (బదినికలు), వేపనూనె మందులను అందించారు. డ్రోన్లను తీసుకు వచ్చి మందులు పిచికారీ చేయించారు. కేరళ, తమిళనాడు నుంచి తెల్లదోమ సోకిన మొక్కలు రాగా వాటిని గుర్తించి తగులబెట్టారు. తొలి ఆరు నెలల్లో దీని ఉధృతిని అరికట్టేందుకు కృషి చేసిన ఉద్యానశాఖ అధికారులు తరువాత కాలంలో అలసత్వం ప్రదర్శించారు. దీనికితోడు రైతులు సైతం సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో దీని ఉధృతి క్రమేపీ తీవ్రమవుతోంది. అన్ని ప్రాంతాల్లోను కొబ్బరి, అరటి, ఆయిల్ పామ్ తోటలకు ఇది విస్తరిస్తోంది. ఇప్పటివరకు గోదావరి జిల్లాల కొబ్బరిలో 30 శాతం అంటే సుమారు 50 వేల ఎకరాలకు పైబడి ఈ వ్యాధి సోకిందని అంచనా. చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నిర్మూలనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తాజాగా డ్రైకోక్రైసా ఆస్టర్ మిత్ర పురుగులను రైతులకు అందిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది. మిత్ర పురుగులతో ఎదుర్కొంటున్నాం... తెల్లదోమ ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. రసాయన మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతి, మిత్ర పురుగులు వినియోగం ద్వారా చాలా వరకు దీన్ని అరికట్టే అవకాశముంది. ఎన్కార్సియా గ్వడెలోపే, డైకోక్రైసాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. – ఎన్.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
కడియపులంకలో గుబాళించనున్న ఆధ్యాత్మికత
– బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి -28న షిర్డీసాయి, 30న వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠాపనలు కడియం (రాజమహేంద్రవరం రూరల్) : మండలంలోని కడియపులంక గ్రామం హరిహరక్షేత్రంగా భాసిల్లుతుందని బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి అన్నారు. కడియపులంకలోని శ్రీ అపర్ణాసమేత అనంతేశ్వరస్వామి పంచాయతనక్షేత్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30న విగ్రహ ప్రతిష్ఠాపనలు జరుగుతాయని, 28న శ్రీ షిర్డి సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన స్థానిక ఆలయ కమిటీ, భక్తులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.కోటికి పైగా భక్తుల విరాళాలతో ఆలయం రూపుదిద్దుకుందన్నారు. హరిహరుల ఆలయాలు పక్కపక్కనే నిర్మితమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన మృగశిర నక్షత్రంలో స్వామివారి ప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. శంకర జయంతి, రామానుజాచార్య సహస్ర జయంతి తదితర ప్రాధాన్యమైన రోజుల్లోనే ప్రతిష్ఠాపనకు నిర్ణయించడం విశిష్టతను సంతరించుకుందన్నారు. తొలి దర్శనానికి పలువురు పీఠాధిపతులను ఆహ్వానించినట్లు తెలిపారు. 30న మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. అనేక విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసిన శ్రీమాన్ నల్లాన్‌చక్రవర్తుల సంతోషాచార్యుల బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్ఠాపనలు జరుగుతాయన్నారు. ఏర్పాట్లను ఆలయ నిర్మాణ కమిటీ, గ్రామ భక్తజనులు పర్యవేక్షిస్తున్నారన్నారు.