రామకృష్ణ రిటైర్డ్ బ్యాంకు అధికారి. కుమార్తెకు వివాహం కుదిరింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అతిథులకు, వియ్యాలవారికి రిటర్న్ గిఫ్ట్ కొత్తగా ఏదైనా ఇవ్వాలని ఆయన ఆలోచన. రోజూ సాయంత్రం వాకింగ్‌లో కలిసే మిత్రుడిని సలహా అడిగారు. ఆకర్షణీయమైన మొక్కలను ఇద్దామని సూచించారు. అది రామకృష్ణకు నచ్చింది. వెంటనే కడియపులంక నుంచి తెప్పించి, వాటినే బహూకరించారు.
(రాజమహేంద్రవరం డెస్క్) : రామకృష్ణ ఒక్కరే కాదు. ఇటీవల కాలంలో చాలామంది పర్యావరణ హితం కోరుతూ బహుమతుల జాబితాలో మొక్కలను చేరుస్తున్నారు. జీవం ఉన్న బుల్లి మొక్కలను బహుమతిగా ఇస్తూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. పూలదండలు, పుష్పగుచ్ఛాల స్థానాన్ని క్రమంగా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ప్లాంట్స్ ఆక్రమిస్తున్నాయి.
పెద్ద నాయకులు పర్యటనకు వచ్చినా, ఓ ఉద్యోగి రిటైరైనా శాలువా, మెమెంటోలతో పాటు గిఫ్ట్ ప్లాంట్లు కూడా తప్పనిసరి అయ్యాయి. కాన్వెంట్లో విద్యార్థి పుట్టిన రోజు నాడు క్లాస్ టీచర్లకు తల్లిదండ్రులు మొక్కలనే పిల్లలతో గిఫ్ట్‌గా ఇప్పిస్తున్నారు. అదొక్కటే కాదు పచ్చదనాన్ని ఇష్టపడే ఏ ఇంటి హాల్లో టీపాయ్‌పైన చూసినా ఒకటో, రెండో గిఫ్ట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. మొక్కలు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయని, ఎయిర్ ప్యూరిఫయర్‌గా ఉపయోగపడతాయని ఇలా చేస్తున్నారు.
ఇదో పెద్ద పరిశ్రమ
గిఫ్ట్ ప్లాంట్స్ ..ఇప్పుడో పెద్ద పరిశ్రమ. దీనికి కేరాఫ్ రాష్ట్రంలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ కడియం, కడియపులంక. 15 ఏళ్ల క్రితం గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మొదలయ్యాయి. స్వల్పకాలంలోనే నర్సరీ రంగంలో ఓ ప్రత్యేక విభాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి . ప్రస్తుతం వాటి టర్నోవర్ రూ.కోట్లలోకి చేరుకుంది. జామియా కులకస్, పొట్టి రకానికి చెందిన స్నేక్, రంగురంగుల అగ్లోనిమాలు, మెరంటా, సింగోనియం, సక్కలెన్స్ వంటి మొక్కలు గిఫ్ట్ ప్లాంట్స్‌గా ఆదరణ పొందాయి.
పీస్ లిల్లీ, ఆంథూరియం, కలించీ, ఆర్చిడ్స్ వంటివి పూలతో కూడి న గిఫ్ట్ ప్లాంట్స్. వాటిలో ఆక్సిజన్ ప్లాంట్‌గా పిలిచే జామియా కులకస్ ఎక్కువగా అమ్ముడయ్యే గిఫ్ట్‌ప్లాంట్. వీటిని పూణె, బెంగళూరుల నుంచే గాకుండా థాయ్‌లాండ్, చైనా వంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ నర్సరీల యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. గిఫ్ట్‌ప్లాంట్స్ చిన్నవి, సున్నితమైనవి కావడంతో ఎండవానల నుంచి రక్షణకు పాలీహౌస్‌లలో విక్రయానికి ఉంచుతారు.
వాటి కోసం పెద్దపెద్ద నర్సరీల యాజమానులు రూ.లక్షలు ఖర్చు చేసి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కడియపులంక ప్రాంతంలో 40 వరకూ పాలీహౌస్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలకు సరఫరా అవుతుంటాయి. ఒక్కోగిఫ్ట్ ప్లాంట్ రకాన్ని బట్టి ఇంచుమించు రూ.250 నుంచి రూ.1000 వరకూ రేటు పలుకుతోంది.
వెలెన్షియాలు..
సాధారణంగా 4, 5, 6 అంగుళాల సాధారణ కుండీల్లో గిఫ్ట్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. మట్టికి బదులు పోషకాలు ఎక్కువగా ఉండే పాట్ మిక్స్ వాడుతుంటారు. మొక్కలతో కూడిన ఆ కుండీలను అంతకంటే అర అంగుళం ఎక్కువ సైజులో వివిధ రంగుల్లో, ఆకర్షణీయంగా ఉండే మరో కుండీలో ఉంచుతారు. దానిని వ్యవహారికంగా అవుటర్ పాట్ అంటారు. అసలు పేరు వెలెన్షియా.ప్లాస్టిక్ కుండీలు, గార్డెన్ ఉపకరణాలు తయారు చేసే పెద్దపెద్ద కంపెనీలే వివిధ రూపాల్లో, డిజైన్లలో ఆకట్టుకునేలా ఈ వెలెన్షియాలను తయారు చేస్తున్నాయి. వీటి అవుట్‌లెట్‌లు కడియపులంక ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో కీలకం
నూతన సంవత్సర వేడుకలకు ఆతీ్మయులకు గిఫ్ట్ ప్లాంట్స్‌ను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. కడియం,కడియపులంకల్లో ఏడాది పొడవునా సాగే విక్రయాయి ఒక ఎత్తయితే, న్యూ ఇయర్ పేరుతో జరిగే గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మరో ఎత్తు. ఈ క్రమంలో డిసెంబర్ మూడో వారం నుంచి కడియం, కడియపులంకలలోని ప్రధాన నర్సరీల యజమానులు ఏటా సరికొత్త రకాల గిఫ్ట్ ప్లాంట్స్‌ను దిగుమతి చేసుకుంటారు. డిసెంబర్ కావడంతో వాటిలో వివిధ రకాల స్వదేశీ, విదేశీ రకాల పూలమొక్కలు కూడా ఉంటాయి. డిసెంబర్ ఆఖరి వారంలోనే రూ.కోట్లలో గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు జరుగుతాయి.
గిఫ్ట్ ప్లాంట్‌తో స్వాగతం
రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో సందర్శనకు తరచూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారికి గతంలో పుష్పగుచ్ఛా లను ఇచ్చి స్వాగతం పలికేవారం. వాటికి బదులు కొంతకాలంగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇచ్చి ఆహా్వనిస్తున్నాం. పుష్పగుచ్ఛాలు రెండు రోజులకే వాడిపోతాయి. గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ కాల ఉంటా యి. ఆక్సిజన్‌ను ఇస్తాయి. పర్యావరణ రక్షణకు మేం కూడా ఎంతో కొంత మేలు చేసినట్టూ ఉంటుంది. – వీఎస్‌ఎల్ రావు, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్, రాజమహేంద్రవరం డిపో
12 ఏళ్లుగా విక్రయిస్తున్నాం
కడియపులంకలో 12 ఏళ్లుగా గార్డెన్ ఉపకరణాలు విక్రయిస్తున్నాం. ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు వెలెన్షియాల విక్రయాలు బాగా పెరిగాయి. అన్ని సైజుల్లో, రంగుల్లో మా వద్ద అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాలు, పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతుంటారు. – రాజ్‌కుమార్ పాండే, మేనేజర్, హర్ష్ దీప్, గార్డెన్ ఉపకరణాల అవుట్‌లెట్, కడియపులంక
సబ్సిడీపై పాట్ మిక్స్ ఇవ్వాలి
రాష్ట్రంలోనే అతిపెద్ద గిఫ్ట్ ప్లాంట్ మార్కెట్‌గా కడియం, కడియపు ఎదిగాయి. గిఫ్ట్‌ఫ్లాంట్స్ ఆక్సిజన్‌ను ఇవ్వడమే కాదు, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ కూడా. వాటిని విక్రయించే నర్సరీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం. ప్రధానంగా ఉద్యాన శాఖ ద్వారా మట్టికి బదులుగా గిఫ్ట్ ప్లాంట్‌కు వినియోగించే పాట్ మిక్స్‌ను రాయితీపై ఇచ్చి ప్రోత్సహించాలి. – మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ అధినేత, కడియపులంక
Comments
Please login to add a commentAdd a comment