కార్తీక్‌కుమార్‌రెడ్డి, జయలక్ష్మి(ఫైల్)
రాయచోటి టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందారు. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి–చిత్తూరు జాతీయ రహదారిలోని రాయచోటి రింగ్ రోడ్డు సమీపాన ఆదివారం తెల్లవారుజామున కారు, ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆత్మకూరుకు చెందిన జయలక్ష్మి భర్త అకాల మరణంతో ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేయాలనుకుంది. అనుకున్న విధంగానే ఇద్దరినీ తీర్చిదిద్దింది. ఇద్దరు కొడుకులు స్థిరపడ్డారనుకొంటున్న సమయంలో చిన్నకొడుకుతోపాటు తాను కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. జయలక్ష్మికి పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఇద్దరి కుమారుల పోషణ బాధ్యత ఆమెపై పడింది. ఇద్దరినీ ఇంజినీరింగ్ వరకు చదివించింది. పెద్దకుమారుడు దినేష్‌కుమార్‌రెడ్డి ఉద్యోగం రాకపోవడంతో బెంగళూరులోనే తల్లితో కలిసి క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు కార్తీక్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
సొంతూరికి వెళుతుండగా..
లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా స్వగ్రామానికి వెళ్లలేదు. సడలింపుల తర్వాత సొంత గ్రామానికి వెళ్లాలనే కోరికే వారి ప్రాణం తీసింది. చిన్న కుమారుడు రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. తన మిత్రుడి కారు తీసుకొని తల్లితో కలిసి శనివారం రాత్రి బెంగళూరు నుంచి ఆత్మకూరుకు వెళ్లేందుకు బయలుదేరారు. రాయచోటిలోని డాబా సమీపానికి చేరుకోగానే కారు, ఐషర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్‌కుమార్‌రెడ్డి(26), పక్క సీట్లో ఉన్న అతని తల్లి జయలక్ష్మి(45) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో ఉన్న మిత్రుడు సందీప్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment