
సత్యవతి, సుఖేష్‌రామ్(ఫైల్)
చోడవరం/సబ్బవరం(విశాఖపట్నం): సోదరులకు రాఖీ కట్టడానికి కన్నవారింటికి బయల్దేరిందామె.. మరికాసేపట్లో అన్నలిద్దరి ఆశీర్వాదం తీసుకోవాల్సివుండగా.. మృత్యువు ఇసుక లారీ రూపంలో ఎదురొచ్చింది. కొడుకుతో సహా ఆమెను కబళించింది. ఈ విషాదకర ఘటన చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. సబ్బవరం మండలం పెద యాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (34), తన కుమారుడు సుఖేష్‌రామ్ (18)తో కలిసి ఉదయం 8 గంటలకు తన కన్నవారి ఊరైన మునగపాక బయల్దేరారు.
చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే?
సుఖేష్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా తల్లి సత్యవతి వెనుక కూర్చున్నారు. సబ్బవరం– వెంకన్నపాలెం రోడ్డులో దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వెంకన్నపాలెం వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆకస్మికంగా మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో మోటారు సైకిల్‌తోపాటు లారీ కూడా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయాయి. మోటార్ సైకిల్‌పై వస్తున్న తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆనందం.. అంతలోనే విషాదం
శరగడం సత్యవతి స్వగ్రామం మునగపాక. అక్కడ ఆమె సోదరులు ఉంటారు. వారికి రాఖీ కట్టి.. ఆ ఊళ్లో ఉన్న తన పొలంలో వరినాట్లు వేయాలని భావించిందామె. కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమెకు భర్త రాంబాబు, కుమార్తె కుందన ఉన్నారు. కన్నీరుమున్నీరవుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో సబ్బవరం మండలం పెద యాతపాలెం, మునగపాక గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు
ఎస్‌ఐ తెలిపారు.
అతి వేగమే ప్రమాదానికి కారణం
లారీని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపాడు. అంతేకాకుండా తాను వెళ్లే వైపు కాకుండా పూర్తిగా కుడివైపునకు ఒక్కసారిగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలో మరే వాహనం వచ్చినా వాటిని కూడా ఈ లారీ ఢీకొట్టి ఉండేదని అక్కడి వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment