కుమారుడు సూరన్న(ఫైల్) తల్లి వెంకటలక్ష్మి మృతదేహం
కరీమాబాద్: మృత్యువులోనూ తల్లీకొడుకులు పేగుబంధం వీడలేదు. అనారోగ్యానికి గురై గుండెపోటుతో కుమారుడు మృతిచెందగా.. ఆ మృతదేహం వద్ద రాత్రంతా ఏడ్చిన తల్లి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన సంఘటన నగరంలోని వరంగల్ అండర్ రైల్వేగేట్ రంగశాయిపేటలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం... నగరంలోని రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ కందగట్ల సూరన్న(53)కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యాడు.
మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందడంతో బుధవారం ఉదయం వరకు కొడుకు మృతదేహం వద్ద ఏడ్చిన తల్లి కందకట్ల వెంకటలక్ష్మి(65) సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్తతకు గురైంది. ఈ క్రమంలో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి వెంకటలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తిరిగి రంగశాయిపేటకు చెందిన అంబులెన్స్‌లో వెంకటలక్ష్మి మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
రంగశాయిపేటలో విషాదం..
గుండెపోటుతో మృతి చెందిన కొడుకు సూరన్న, ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి తల్లి వెంకటలక్ష్మి కూడా మృతి చెందడంతో రంగశాయిపేటలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఓ పక్క కొడు కు మృతదేహాన్ని పాడెపై పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగానే తల్లి కూడా మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తిరిగి ఆమె మృతదేహాన్ని కూడా పాడెపై పెట్టి బంధువులు, కుటుంబ సభ్యులు మోసుకెళ్తున్న దృశ్యం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ లేవ లేనిస్థితిలో ఉన్న వెంకటలక్ష్మి భర్త సాంబయ్య దుఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేని పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment