అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి.. | Couple Died In A Road Accident While Saving A Pig At Narkatpalli | Sakshi
Sakshi News home page

అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..

Published Mon, Sep 16 2019 12:05 PM | Last Updated on Mon, Sep 16 2019 12:05 PM

Couple Died In A Road Accident While Saving A Pig At Narkatpalli - Sakshi

నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై బోల్తాకొట్టిన టాటాఏస్‌

సాక్షి, మిర్యాలగూడ: తమ ఆరాధ్య దైవాన్ని ప్రతి యేడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆ.. గిరిజనులకు ఆనవాయితీ.. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు గిరిజనులు తమ బంధువులతో కలిసి శనివారం ఇష్ట దైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపారు. మరుసటిరోజు మధ్యాహ్నం తిరిగి తమ స్వగ్రామాలకు టాటాఏస్‌ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో వృద్ధ దంపతులు మృత్యుఒడికి చేరుకోగా.. టాటాఏస్‌ డ్రైవర్‌తో సహా పదిమందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్‌పై ఆదివారం చోటు చేసుకుంది.      

క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్‌ లక్పతి(75), ధీరావత్‌ దోర్జన్‌ (64), ధీరావత్‌ గున్య, ధీరావత్‌ సక్రి, ధీరావత్‌ రాజు, ధీరావత్‌ రోహిత్, ధీరావత్‌ చింటు, తుర్కపల్లి మండలం సంగెం తండాకు చెందిన లకావత్‌ వస్రాం, లకావత్‌ సోను, లకావత్‌ వినోద్‌తో పాటు చికటిమామిడి గ్రామానికి చెందిన ధీరావత్‌ గణేష్‌ బంధువులు. వీరు ప్రతియేడు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే వీరందరూ తుర్కపల్లి మండలం సంగెంతండాకు చెందిన లకావత్‌ వెంకటేశ్‌ టాటాఏస్‌ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకుని శనివారం కల్లెపల్లికి వచ్చారు. మైసమ్మ తల్లికి యాటను బలిచ్చి విందు చేసుకుని రాత్రి అక్కడే బసచేశారు. 

ధీరావత్‌ దోర్జన్‌, ధీరావత్‌ లక్పతి మృతదేహం

వరాహాన్ని తప్పించే క్రమంలో..
ఇష్టదైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపిన బంధువులందరూ ఆదివారం మధ్యాహ్నం టాటాఏస్‌ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో వీరి వాహనానికి మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్‌ రోడ్డుపైకి ఒక్కసారిగా వరాహం అడ్డుగా వచ్చింది. దీంతో టాటాఏస్‌ డ్రైవర్‌ లకావత్‌ వెంకటేశ్‌ దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమయంలో అతివేగంతో ఉన్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లో బోల్తాకొట్టింది. 

ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరింశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులతో పాటు డ్రైవర్‌ వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. వరాహాన్ని తప్పించే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని టాటాఏస్‌ డ్రైవర్‌ పోలీసు అధికారులకు వివరించాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 

చెల్లాచెదురుగా..
అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్న వారు అనుకోని హఠాత్పరిణామానికి హతాశులయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే టాటాఏస్‌ వాహనంలో ఉన్న వారందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొమ్మల రామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్‌ లక్పతి(75), ధీరావత్‌ దోర్జన్‌ (64) అక్కడికక్కడే దుర్మరణం చెందగా డ్రైవర్‌తో సహా మిగిలిన వారందరూ గాయపడ్డారు.  ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు 108 వాహన సహాయంతో వారిని తొలుత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement