ఆ రహదారిపై ప్రయాణం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..! ప్రమాదం ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియని పరి స్థితి. అదే ఎన్‌హెచ్ – 163. ఈ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ ఒక్కరినైనా బలి తీసుకుంటోందంటే అతిశయోక్తి కాదు. గడిచిన రెండు నెలల్లోనే 47 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. ఒక్క తాళ్లగూడెం, బాహుపేట స్టేజీల సమీపంలోనే 15 మంది వరకు దుర్మరణం చెందారు. విస్తరణ పనులు జరగుతున్న ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. యాక్సిడెంట్‌లకు అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నప్పటికీ డేంజరస్ స్పాట్‌లతో సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు.
సాక్షి, ఆలేరు: 163 జాతీయ రహదారి అంటే వాహనదారులు.. ప్రయాణికులు హడలిపోతున్నారు. ఈ జాతీయ రహదారి గుండా వెళ్లాలన్నా.. రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలన్నా భయాం దోళన చెందుతున్నారు. హైదరాబాద్ – వరంగల్ 163 జాతీయ రహదారి యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్తుంది. ప్రధానంగా ఈ రహదారిపై బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాలు ఉంటాయి. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుం టాయి. వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో ఈ రహదారిపై ఏదో ఒక చోటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో నెలలో పదుల సంఖ్యలో మృతిచెందుతుండగా.. వందల సం ఖ్యలో గాయాలపాలవుతున్నారు. ప్రస్తుతం రహదారికి ఆనుకుని ఉన్న మండలం వంగపల్లి నుంచి బాహుపేట వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వన్ వేలో వాహనాలు వెళ్తున్నాయి. రాత్రి సమయాల్లో ఈ రూట్‌లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల డేంజర్ స్పాట్ల గుర్తింపు..
జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రధానంగా కొండమడుగుమెట్టు, కలెక్టరేట్, భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం బైపాస్, నల్లగొండ క్రాసింగ్ , రామాచంద్రాపురం క్రాస్‌రోడ్డు, రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే కనెక్టివిటీ రోడ్డు, రాయగిరి కమాన్, జమ్మాపురం, వంగపల్లి, తాళ్లగూడెం బిడ్జి, బాహుపేట స్టేజీల వద్ద ప్రమాదాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు వీటిని డేంజర్ స్పాట్‌లుగా గుర్తించారు. ఇక్కడ ప్రమాదాల ని వారణకు అధికారులు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నివారణ చర్యలు తీసుకున్నా...
డేంజర్ స్పాట్ల దగ్గర జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఎక్కువ ప్రమాదాలు అతివేగం వల్లే అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా జాతీయ రహదారులపై సూచిక బోర్డులు, ఇతర ఏర్పాట్లు చేయడం లేదని వాహనదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వేగ నియంత్రణకు భువనగిరి బైపాస్‌లోనే స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
విస్తరణ పనులు పూర్తయితేనే...
ప్రస్తుతం వంగపల్లి నుంచి బాహుపేట స్టేజీ వరకు నేషనల్ హైవే 163 రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మూడు నుంచి నాలుగేళ్లుగా పనులు చేస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక వైపు రోడ్డు పనులు చేస్తుండటంతో మరో రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రామాజీపేట, పెద్దకందుకూర్, చిన్నకందుకూర్, తాళ్లగూడెం బ్రిడ్జి, బాహుపేట స్టేజీల వద్ద వాహనాలను క్రాసింగ్ చేస్తున్నప్పటికీ అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు తికమకై ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అంటున్నారు.
నిద్ర మత్తు.. క్రాసింగ్‌ల వద్ద...
ఈ జాతీయ రహదారిపైనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా టర్నింగ్‌ల వద్ద పెద్దపెద్ద వాహనాలు బోల్తా కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వరంగల్ – హైదరాబాద్, గజ్వేల్– చిట్యాల మధ్య ఉన్న జాతీయ రహదారుల గుండా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటా యి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు రూపంలో పెద్ద లారీలు వస్తుంటాయి. రాత్రి సమయాల్లో డ్రైవర్లు వాహనాలను నడిపి నిద్ర సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా తెలుస్తోంది. ఉదయం డ్రైవర్ల కళ్లు మూతపడుతుంటే వాహనం నడిపి ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి, క్రాసింగ్‌ల వద్ద అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వాహనదారులు కొందరు రాత్రి సమయాల్లో దాబాలు ఉన్న ప్రాంతాల్లో ఇష్టానూసారంగా రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అతివేగమే ప్రమాదాలకు కారణం...
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే వాహనదారులు తమ ప్రా ణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జాతీయ రహదారి కావడంతో ఈ రోడ్డుపై వాహనాలు కార్లు 120 నుంచి 160 స్పీడ్‌తో దూసుకెళ్తాయి. ఇక బస్సులు, లారీలు వందకు పైగానే స్పీడ్‌లో ఉంటాయి. ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయడానికి వాహనదారులు అధికంగా పోటీ పడుతుంటారు. బీబీనగర్ నుంచి రాయగిరి వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉంటుంది.. జమ్మాపురం నుంచి బాహుపేట వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో ఒక వైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. ఈ మార్గంలో వాహనాలు ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. అతి వేగంతోనే ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం..
వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న యాదగిరిగుట్ట మండలం వంగపల్లి నుంచి బాహుపేట స్టేజీ వరకు బ్లాక్స్ స్పాట్స్‌ను గుర్తించాం. అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి ప్రమాద హెచ్చరికలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేస్తాం. అంతే కాకుండా ప్రమాదాలను సూచించే సిగ్నల్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదాలు అతివేగం, ఓవర్‌టేక్ చేయడంతోనే చోటు చేసుకున్నాయి. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న దృష్ట్యా వాహనదారులు నెమ్మదిగా వాహనాలను నడపాలి.
– నర్సింహారావు, పట్టణ ఇన్‌స్పెక్టర్, యాదగిరిగుట్ట
గడిచిన మూడు నెలల్లో 108 ప్రమాదాలు
మాసం | ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
జూలై | 48 | 25 | 36 |
ఆగస్టు | 45 | 14 | 38 |
సెప్టెంబర్ | 15 | 8 | 10 |
మొత్తం | 108 | 47 | 84 |
Comments
Please login to add a commentAdd a comment