
నిర్మాత గుండాల కమలాకర్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. (చదవండి: నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి)
ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించెందుకు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఈ రోజు బయలుదేరారు. ఈ క్రమంలో అంబులెన్స్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment