ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి గాయత్రి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హోలీ వేడుకలో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె మరికొద్ది క్షణాల్లోనే జీవచ్చవంలా మారడంతో ఆమె సన్నిహితులు, సహానటినటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త తెలిసి యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్, శ్రీహాన్ సహా పలువురు సోషల్ మీడియా వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నటి సురేఖ వాణి సైతం ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాయత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది.
చదవండి: రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ?
ఈ మేరకు సురేఖ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నా. ప్లీజ్ తిరిగి రా గాయత్రి. మనం మంచి పార్టీ చేసుకుందాం. నీతో ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. తిరిగి రా తల్లి..! ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లలేవు. ఇది సరైన సయమం కాదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మిస్ యూ.. డాలీ’ అంటూ సురేఖ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సురేఖ, ఆమె కూతురు సుప్రితలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో తెలిసిందే. తరచూ రిల్స్ చేస్తూ, పార్టీలు, పబ్‌లు, టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ఈ మధ్య గాయత్రి సురేఖ, సుప్రితలతో క్లోజ్ అయ్యింది.
చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం
దీంతో వారితో కలిసి పార్టీలు చేసుకోవడం, రిల్స్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన గాయత్రిని ఓ నెటిజన్ సురేఖ వాణి గురించి అడగ్గా.. ‘తను నాకు సెకండ్ మదర్ లాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అదే ఫొటో పోస్ట్‌ను సురేఖ పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా గాయంత్రి శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి కారులో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీ కొట్టింది. దీంతో గాయత్రి ఆ పక్కనే రెస్టారెంట్‌లో గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మద్యం సేవించి కారు నడపడం, అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment