ఏదీ..ఉదయసముద్రం | Udaya ocean project | Sakshi
Sakshi News home page

ఏదీ..ఉదయసముద్రం

Published Mon, Dec 29 2014 2:45 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Udaya ocean project

నకిరేకల్/నార్కట్‌పల్లి :ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు నత్తకు నడక నేర్పి న చందంగా సాగుతున్నాయి. జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సు మారు లక్ష ఎకరాలకు సాగునీరు, 109 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు ఇటు అధికారులుగానీ,అటు ప్రజాప్రతినిధులు గానీ ప్రయత్నించకపోవడంతో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి వర్షాకాలంలో కూడా సాగునీరు లభించని గ్రామాలకు సైతం నీరందించడం ద్వారా కరువుఛాయలు లేకుండా చేయాలనే తలంపుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఉదయసముద్రం-బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2007 సెప్టెంబర్ 4వ తేదిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి రూ. 699 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నార్కట్‌పల్లి మం డలం బ్రాహ్మణవెల్లెంల గ్రామశివారులో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రెండు సంత్సరాల వరకు కూడా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. తర్వాత 2009లో పనులు ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. 2012 నాటికి ప్రాజెక్టు నిర్మాణంపనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా నేటికీ పూర్తి కాలేదు. ఒప్పందం గడువు కూడాపూర్తయి రెండేళ్లు దాటినా 50 శాతం పనులు కూడ పూర్తి కాలేదు. ప్రాజెక్టు మెత్తం విలువరూ. 699 కోట్లు కాగా ఇప్పుటి వరకూ ప్రభుత్వం కేవలం రూ. 199 కోట్లు మాత్రమే మంజూరు చేసింది.
 
 ఇదీ.. ప్రాజెక్టు లక్ష్యం
 జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, నకిరేకల్, కట్టంగూరు, నల్లగొండ, శాలిగౌరారం మండలాలకు సాగు, తాగు నీటిని అందించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టు నుంచి ఉదయ సముద్రంలోకి            
 వచ్చిన నీటిని ఎత్తి పోతల ద్వారా తరలించి ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సి
 ఉంది. ఇదే లక్ష్యంతో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దివం
 
 గత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ఒప్పించారు. రూ. 699 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు
 2007 జూన్ 13వ తేదిన జీఓ నెంబర్ 143 ను జారీ చేశారు. ప్రభుత్వ పరిపానల అమోదం కూడా తెలిపింది.  
 
 నిధుల కొరత
 ప్రాజెక్టు మెత్తం విలువ రూ. 699 కోట్లు కాగా ఇప్పుటివరకు  కేవలం రూ. 199 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మిగతా నిధులు మంజూరు కాకపోవడంతో ఇతర నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. సొరంగమార్గం 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా నేటివరకు 8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ప్రస్తుతం 292 ఎకరాల్లో ఎర్త్‌బండ్, మట్టికట్ట తదితర పనులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. మరో రెండేళ్లపాటు పనులు కొనసాగిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తికాదని వారు పేర్కొంటున్నారు.
 
 ముందుకు సాగని భూసేకరణ
 ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులను
 నేటికీ పూర్తి చేయలేదు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 935 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇందులో 550 ఎకరాలు రిజర్వాయర్‌కు, 95 ఎకరాలు సొరంగానికి, 230 ఎకరాలు అప్రోచ్ కెనాల్‌కు, 60 ఎకరాలు సర్జ్‌పూల్‌కు సేకరించారు. కుడి కాల్వ కోసం 34.80 కిలోమీటర్లు, ఎడమ కాల్వ కోసం  18.70 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది.
 4లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం
 ప్రాజెక్టు ప్రాంభమైనప్పటి నుంచి ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాజెక్టు, ఇతర నిర్మాణాలు పూర్తి కావాలంటే నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. కానీ దానిని అందించడంలో శ్రద్ధ లేదు. ఇసుక కొరతతో పనులు ముందుకు సాగడం లేదు.
 
 రెండేళ్లలో పూర్తి చేయిస్తా
 లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన బ్రాహ్మణవెల్లంల- ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులను మరో రెండేళ్లలో పూర్తి చేయిస్తా. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమస్యలను వివరించాను. స్పందించిన సీఎం ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి భూసేకరణ, ఇసుక కొరత తదితర సమస్యలు ఉన్నాయి. త్వరలో వీటిని కూడా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటాను.  
 - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే, నల్లగొండ
 
 గత పాలకుల వైఫల్యంతోనే
 బ్రాహ్మణ వెల్లంల- ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులు గత పాలకుల వైఫల్యంతోనే అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో మంత్రులు ,ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు నిర్మాణం పనులను పూర్తి చేయించలేకపోయారు. త్వరలోనే నిధుల విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాం. నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయించేలా కృషి చేస్తా.
 - వేముల వీరేశం, ఎమ్మెల్యే, నకిరేకల్
 
 సాగు నీటి కోసం ఎదూరు చూస్తున్నాం
 సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో మా వ్యవసాయ భూమి కొంత కోల్పోయాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాకు ఎంతో మేలు చేకూరుతుందని ఆశించాం. ఉన్న భూమిలో సాగు చేసుకుందామనుకుంటే నేటికీ పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పనులను పూర్తి చేసేలా చూడాలి.
 - డి.సోమిరెడ్డి, చౌడంపల్లి, నార్కట్‌పలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement