వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
గుర్ల: గుర్ల మండల కేంద్రంలోని జాతీయ రహదారి సోమవారం రక్తసిక్తమైంది. జాతీయ రహదారిపై వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు.
శుభకార్యానికి వెళ్లి వస్తూ..
నెల్లిమర్లలో గల రామతీర్థం జంక్షన్‌కు దగ్గరలో నివాసముంటున్న పొట్నూరు రమణ ఆదివారం ఉదయం శుభకార్యం నిమిత్తం గుర్ల మండలంలోని పల్లిగండ్రేడు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకు నెల్లిమర్ల తిరుగు ప్రయాణంలో మోటారు సైకిల్‌పై వెళ్తుండగా కెల్ల బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి గెడ్డ కింద తుప్పల్లో పడి మృతి చెందాడు. పొట్నూరు రమణ (35), ఇంటికి చేరకపోవడంతో అతని తండ్రి అప్పన్న పల్లి గండ్రేడు లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలు దాటిన తరువాత కూడా రమణ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బంధువులు, తండ్రి కలిసి వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కెల్ల గెడ్డ బ్రిడ్జి వద్ద విగతజీవిగా పడి ఉన్న రమణను సోమవారం ఉదయం గుర్తించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు రమణ, అతను నడుపుతున్న బైకును పరిశీ లించారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు.
కుటుంబానికి ఆధారం పోయి..
బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యాడన్న వార్త తెలియడంతో మృతుని భార్య సత్యవ తి, పిల్లలు కిరణ్, మణి కుటుంబసభ్యులు శోకసంద్రం లో మునిగిపోయారు. ఇంటి పెద్ద దిక్కు, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నెల్లిమర్ల మండలంలోని కుదిపి గ్రామానికి చెందిన రమణ ఉద్యోగరీత్యా కొంత కాలంగా నెల్లిమర్లలో కాపురముంటున్నారు. మిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ యూనియ న్ బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందాడు. రమణ మృతి చెందాడన్న వార్త తెలియడంతో మిమ్స్ ఆస్పత్రి ఉద్యోగులు, బంధువులు అంతా సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
తన స్కూల్‌ను చూసుకోవడానికి వెళ్తూ..
బాడంగి మండలం, గూడెపువలస గ్రామానికి చెందిన భూపతిరాజు వేణుగోపాలరాజు(48) పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామంలో నిర్వహిస్తున్న సత్యాస్ భారతి ప్రైవేట్ స్కూల్‌ను సందర్శించేందుకు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా,మండలంలోని గూడెం జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనలో మృతుడు నుజ్జునుజ్జయి పోవడంతో శరీరంలోని భాగాలన్నీ చెల్లా చెదురయ్యాయి. ఈ ప్రమాద ఘటన చూపరుల హృదయాలను కలిచివేసిం ది. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వేణుగోపాల రాజు స్వగ్రామం నుంచి బైక్‌పై బయలుదేరి పాలకొండ, విజయనగరం ప్రధాన రహదారిలోని గూడెం జంక్షన్ వద్ద ముందుగా వెళ్తున్న విశాఖ డైరీ పాలట్యాంకరును తప్పించుకుని ముందుకు వెళ్తుండగా ట్యాంకరు కింద పడి మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు.
మృతుని కుటుంబ వివరాలివి..
మృతుడు వేణుగోపాలరాజుకు భార్య సత్యవతి, సుమంత వర్మ, షరత్ వర్మ అనే ఇద్దరు కుమారులు న్నారు. ఆయన తండ్రి భూపతిరాజు వెంకటపతిరాజు గూడెపు వలస గ్రామ సర్పంచ్. మృతి చెందిన భూపతి రాజు ఆ గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు. వేణుగోపా లరాజు తాను స్కూల్ నిర్వహిస్తున్న కుమిలిలోని కోవెళ్లకు తన సోదరుడి (ప్రభుత్వశాఖలో ఉన్నత ఉద్యోగి)తో కలిసి మరమ్మతులు చేపట్టారని ఆ గ్రామస్తులు తెలిపారు.