
జగదేవ్‌పూర్ మండలంలో ఘటన
జగదేవ్‌పూర్(గజ్వేల్): నచ్చిన కారు తండ్రి కొనివ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్, స్థానికుల కథనం మేరకు..
చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు జానీ(21)కి వివాహం కాలేదు. గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి జానీ తండ్రిని బీఎండబ్ల్యూ కారు కొనియాలని, లేకపోతే చనిపోతానని తరచూ గొడవ పడుతున్నాడు. మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సముదాయించారు. అయినా జానీ ప్రవర్తనలో మార్పు రాలే దు. 30న సిద్దిపేటలో కారు షోరూమ్‌కు వెళ్లి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును చూశారు.
మారుతీ కారు తనకు వద్దని బీఎండబ్ల్యూ కారే కావాలని పట్టుబట్టి మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.