సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : గంజాయి నియంత్రణ, నిర్మూలనలో దేశంలోనే ఇదో సరికొత్త రికార్డు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిది. అనకాపల్లి నియోజకవర్గం కోడూరులో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సంచులకు స్వయంగా నిప్పు పెట్టి ధ్వంసం చేశారు.
దశాబ్దాల కాలంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారు. దళారులు, మావోయిస్టులు గిరిజనులను భయపెట్టి గంజాయిని సాగు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ప్రభుత్వం గంజాయి రవాణా, సాగుపై దృష్టిపెట్టింది. నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 577 కేసుల్లో 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
అలాగే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాల్లోని 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో మొత్తం 7,552 ఎకరాల్లోని గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి విలువ రూ.9,251.32 కోట్ల దాకా ఉంటుంది. ఎస్‌ఈబీ, శాంతి భద్రతల పోలీసులు 7,152 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తే.. 400 ఎకరాల వరకూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధ్వంసం చేయడం విశేషం. గంజాయి సాగును గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆథారిత శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో ‘ఆడ్రిన్ ఇమేజరీ’ని వినియోగించారు.
ఓ పక్క సరిహద్దు గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూనే.. అదే సమయంలో అన్ని రవాణా మార్గాల్లో విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించారు. 120 అంతర్రాష్ట్ర మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో గిరిజనులు, స్థానికులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారిలో చైతన్యం కలిగేలా 1,963 అవగాహన కార్యక్రమాలు, 93 ర్యాలీలు నిర్వహించారు. అలాగే గంజాయి సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా కాఫీ, జింజర్, రాగులు, స్ట్రాబెర్రీ, మిరియాలు తదితర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
టూరిస్టులుగా వచ్చి.. స్మగ్లింగ్
గంజాయి స్మగ్లర్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లుగా వస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు రైలు, బస్సు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలోనే విశాఖ ఏజెన్సీలోని గంజాయికి ప్రత్యేకమైన ఆదరణ ఉండటంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. అరెస్ట్ అయిన 1500 మందిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగర్లు 154 మంది ఉండటం గమనార్హం. గంజాయి ధ్వంసం కార్యక్రమంలో అడిషనల్ డీజీ(ఎల్ అండ్ బీ) రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ(గ్రే హౌండ్స్) ఆర్కే మీనా, ఎస్‌ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
గంజాయిని గుట్టలుగా పేర్చి తగలబెడుతున్న దృశ్యం
శారదా పీఠంలో డీజీపీ..
విశాఖ శ్రీ శారదా పీఠాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సచివాలయ వ్యవస్థతో గిరిజనుల్లో పెనుమార్పు
ఆపరేషన్ పరివర్తన్‌తో గిరిజన గ్రామాల ప్రజలు, యువతలో మార్పు మొదలైంది. వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గిరిజన యువతలో మార్పునకు కీలకంగా మారింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుగా గిరిజన యువత చేరడం, తద్వారా గంజాయి సాగుతో నష్టాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియజేయడం వంటివి కీలక పరిణామాలు.
– గౌతమ్ సవాంగ్, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment