సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను శాసిస్తున్న స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) సిద్ధమైంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కోసం జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది.
648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు
ఏవోబీలో గంజాయి దందాను శాసిస్తున్న 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెబ్ గుర్తించింది. వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారు. ఎంపిక చేసిన గిరిజనుల ద్వారా గంజాయి సాగు చేయించి, పంట వచ్చిన తరువాత ఎండబెట్టించి, వారే కొనుగోలు చేసి ఏడాది పొడుగునా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అడపాదడపా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాయి గానీ, ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన స్మగ్లర్లపై గురి పెట్టలేదు.
మొదటిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారి ఆట కట్టిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్న రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సెబ్ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. పరస్పర సహకారంతో ఇప్పటికే 50 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లని సెబ్ అరెస్టు చేసింది. రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలకు వెళ్లి 30 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ పోలీసులు 15 మందిని మన రాష్ట్రానికి అప్పగించారు.
కేరళ ఇద్దరిని, కర్ణాటక ఇద్దరిని, తమిళనాడు ఒకరిని అప్పగించాయి. మిగిలిన స్మగ్లర్లను కూడా అరెస్టు చేసేందుకు సెబ్ రెండంచెల్లో ‘జాయింట్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తోంది. డీజీపీ చైర్మన్‌గా ఉండే నోడల్ ఏజెన్సీలో సెబ్ కమిషనర్, డీఐజీలు సభ్యులుగా ఉంటారు. సెబ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కార్యనిర్వాహక టాస్క్ ఫోర్స్‌లో ఎంపిక చేసిన జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు సభ్యులుగా ఉంటారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్షలు విధించేలా పర్యవేక్షిస్తుంది.
రాష్ట్రం నుంచి అప్పగించింది 20 మందిని
కాగా మన రాష్ట్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు ఇతర రాష్ట్రాల్లో అక్రమ మద్యం, ఇతర దందాలకు పాల్పడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చిన జాబితా మేరకు సెబ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని వివిధ రాష్ట్రాలకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment