రాష్ట్రంలో, విశాఖలో హింసకు ప్రధాన కారణం గంజాయి
‘దిశ’ పేరు మారుస్తాం హోం మంత్రి అనిత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సింహాచలం: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్‌కి రాజధానిని చేశారన్నారు. టాస్క్‌ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై దృష్టి సారిస్తామన్నారు.
గంజాయి కారణంగా విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల గుర్తింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. రాత్రి పూట విశాఖలో గుంపులుగా ఉండే వారిపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ నగరంలో 1,700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. డీఅడిక్షన్ కేంద్రాల సంఖ్య పెంచి.. యువతకు, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తామన్నారు.
లక్ష్మీనృసింహస్వామి భూముల్ని రక్షిస్తాం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను పరిరక్షిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచగ్రామాల భూసమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇటీవల చీమకుర్తిలో దివ్యాంగురాలి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఐదేళ్లలో ఎవరికీ భయం లేదని, తప్పుచేసిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉండటమే దీనికి కారణమన్నారు. పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు.
కొంతమంది పోలీసులూ వైఎస్సార్‌సీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, లేదంటే తప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై ఎంక్వైరీ వేస్తామన్నారు. మహిళలు, ఆడపిల్లలను చెడుగా చూడటానికి కూడా భయపడేలా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాగా, హోంమంత్రికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవ్రస్తాన్ని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment