సాక్షి,తాడేపల్లి : పద్మ అవార్డు గ్రహీతలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి.. భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025
పద్మా అవార్డుల ప్రకటన
గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
వారిలో ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment