బస్సు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం
రాజమహేంద్రవరంలో సంఘటన
మర్రిపాలెంలో విషాదం
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది.
బుధవారం రాత్రి ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment