వాకపల్లిలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఎస్‌ఈబీ అధికారులు
సాక్షి, అమరావతి/పాడేరు/గూడెంకొత్తవీధి/చింతపల్లి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ‘ఆపరేషన్ పరివర్తన్’ను ముమ్మరం చేసింది. దీన్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అయిదు రోజుల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించింది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్‌ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టపరిచారు. మొత్తం 283 కేసులు నమోదు చేసి 763 మందిని అరెస్టు చేశారు. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 179 వాహనాలను జప్తుచేశారు.
260 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం లక్ష్యంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఏడు బృందాలుగా పాడేరులో మకాం వేశాయి. జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఆదివారం 260 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అనకాపల్లి అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాల్లో సుమారు 2 లక్షల గంజాయి మొక్కల్ని వేర్లతోసహా పీకేసి నిప్పంటించారు. గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనాపల్లి పంచాయతీల పరిధిలో సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాలవీధి, అసరాడ, కాకరపాడు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో, చింతపల్లి మండలంలోని టేకులవీధి, గడపరాయిలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు మహ్మద్ ఆలీషరీఫ్, షమీర్, ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర, ఎస్‌ఈబీ అధికారులు త్రినా«థ్, మణికంఠ,
డీవీజీ రాజు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలనకు విద్యార్థులతో 2కే రన్
ఏజెన్సీలోని గంజాయి సాగు, అక్రమ రవాణా నిర్మూలనలో గిరిజన యువత భాగస్వాములవ్వాలని పాడేరు ఏఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘నో టు గంజా’, పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా పాడేరులో గిరిజన విద్యార్థులతో 2కే రన్ నిర్వహించారు. చలిగాలులు ఉన్నప్పటికీ 500 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఏఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గంజాయి సాగు ద్వారా విశాఖ ఏజెన్సీకి చెడ్డపేరు వస్తోందన్నారు. గిరిజనులంతా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు యువతను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. గిరి జన యువత జైలు జీవితం గడుపుతూ భవి ష్యత్తును నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment