తూర్పు నౌకాదళాధిపతికి పరమ విశిష్ట సేవా పతకం | Vice Admiral Rajesh Pendharkar awarded prestigious gallantry award | Sakshi
Sakshi News home page

తూర్పు నౌకాదళాధిపతికి పరమ విశిష్ట సేవా పతకం

Published Sun, Jan 26 2025 5:05 AM | Last Updated on Sun, Jan 26 2025 5:05 AM

Vice Admiral Rajesh Pendharkar awarded prestigious gallantry award

సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌కు ప్రతిష్టాత్మక గ్యాలెంట్రీ అవార్డు వరించింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి అందించే శౌర్య పురస్కారాల జాబితా శనివారం వెల్లడైంది. ఇందులో ప్రతిష్టాత్మక పరమ విశిష్ట సేవా పతకాన్ని నలుగురు అధికారులకు ప్రకటించగా, అందులో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ పెంధార్కర్‌ ఒకరు. 2023 ఆగస్ట్‌ 1 నుంచి తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన రాజేష్‌.. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ ఫేర్‌ స్పెషలిస్ట్‌గా తక్కువ కాలంలోనే పేరు గడించారు.

పలు యుద్ధ నౌకల కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి, మహారాష్ట్ర నేవల్‌ ఏరియా ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ ఇన్‌స్ట్రక్టర్‌గానూ వ్యవహరించారు. కమాండర్‌ హోదాలో స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌గా, నెట్‌ సెంట్రిక్‌ ఆపరేషన్స్‌లో ప్రిన్సిపల్‌ కమాండర్‌గా, నేవల్‌ డైరెక్టరేట్‌ (పర్సనల్‌)లో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్‌ అడ్మిరల్‌ హోదాలో డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా, ఫ్లాగ్‌ ఆఫీసర్‌గా, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్‌ అధికారిగా, నేవల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డైరెక్టర్‌ జనరల్‌ నేవల్‌ ఆపరేషన్స్‌(డీజీఎన్‌వో)గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం విశాఖకు బదిలీ అయ్యారు. పెంధార్కర్‌కు పరమ విశిష్ట సేవా పతకం లభించడం పట్ల విశాఖ నౌకాదళ వర్గాలు అభినందనలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement