Cannabis trafficking case
-
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సింహాచలం: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్‌కి రాజధానిని చేశారన్నారు. టాస్క్‌ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై దృష్టి సారిస్తామన్నారు.గంజాయి కారణంగా విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల గుర్తింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. రాత్రి పూట విశాఖలో గుంపులుగా ఉండే వారిపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ నగరంలో 1,700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. డీఅడిక్షన్ కేంద్రాల సంఖ్య పెంచి.. యువతకు, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తామన్నారు. లక్ష్మీనృసింహస్వామి భూముల్ని రక్షిస్తాం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను పరిరక్షిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచగ్రామాల భూసమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇటీవల చీమకుర్తిలో దివ్యాంగురాలి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఐదేళ్లలో ఎవరికీ భయం లేదని, తప్పుచేసిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉండటమే దీనికి కారణమన్నారు. పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు.కొంతమంది పోలీసులూ వైఎస్సార్సీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, లేదంటే తప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై ఎంక్వైరీ వేస్తామన్నారు. మహిళలు, ఆడపిల్లలను చెడుగా చూడటానికి కూడా భయపడేలా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాగా, హోంమంత్రికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవ్రస్తాన్ని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి అందజేశారు. -
గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్
సాక్షి, చిత్తూరు: కారులో గంజాయి తరలిస్తున్న చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగుయువత అధ్యక్షుడు బి.ఎస్.హరికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి 28 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఆయన్ని సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పోలీసులు పట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం నగరి నియోజకవర్గ ఇన్చార్జి గాలి భానుప్రకాష్‌కి ప్రధాన అనుచరుడు. హరికృష్ణ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చదవండి: రఘరామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు పుత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారంవిలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి.జయప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై రోజూ నిందారోపణలు చేసే టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ తన ప్రధాన అనుచరుడు హరికృష్ణ అరెస్టుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, లిక్కర్ స్మగ్లింగ్ మాత్రమే చేసేవారని, నేడు గంజాయి వరకు వ్యాపారాన్ని పెంచారని చెప్పారు. -
1,732 కిలోల గంజాయి పట్టివేత
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలోని జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.70 కోట్ల విలువ చేసే సుమారు 1,732 కేజీల గంజాయిని కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు పరారైనట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఎన్‌హెచ్ 16పై బూరుగుపూడి శివారు పోలవరం కాలువ వంతెన వద్ద జగ్గంపేట సీఐ వి.సురేష్‌బాబు, కిర్లంపూడి ఎస్సై జి.అప్పలరాజులు వాహనాలు తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయ్యింది. అన్నవరం వైపు నుంచి కోళ్ల మేత, ట్రేల లోడుతో వస్తున్న అశోకా లేలాండ్ వ్యాన్‌లో 10 బస్తాల గంజాయి, తాళ్లరేవుకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్‌లో 30 బస్తాల్లో ఉన్న గంజాయి వెరసి 40 బస్తాల్లో ఉన్న 1731.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన కాశీ మాయన్ కుమార్, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ డ్రైవర్ సున్నపు రాజు, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ క్లీనరు వాసంశెట్టి వీరబాబు, విశాఖ జిల్లా చింతపల్లి మండలం పనసలపాడు గ్రామానికి చెందిన కొర్ర ప్రసాద్, విశాఖ జిల్లా జి.కొత్త వీధి మండలం ఎబులం గ్రామానికి చెందిన గొల్లోరి హరిబాబులను అరెస్టు చేశారు. రెండు వ్యాన్లతో పాటు నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన ఒకరు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. -
మరో 287 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్ఈబీ బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ జేడీ ఎస్.సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు మంగళవారం జరిపిన దాడుల్లో ఏజెన్సీలోని జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలో మొత్తం 287 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ గచ్చుపల్లి పరిసర ప్రాంతాల్లో 77 ఎకరాలు, జి.కె.వీధి మండలంలోని గొందిపల్లి, పి.కొత్తూరు, సిల్లిగూడ గ్రామ సమీపంలోని 18 ఎకరాలు, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని కె.పెదబయలు గ్రామ పరిసరాల్లో 40 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పెదబయలు మండలంలోని గుల్లెలు, గోమంగి పంచాయతీల్లోని చావిడిమామిడి, గుల్లెలు, దల్లెలు గ్రామాల్లో 152 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలన్నింటినీ నరికి నిప్పటించారు. కళాజాత ద్వారా ప్రచారం హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి, చీడిపుట్టు, దాలిగుమ్మడి గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. గంజాయి సాగు, రవాణా ద్వారా గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అనర్ధాలు, జైలు జీవితంతో దుర్భర బతుకులు, తదితర అంశాలపై పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. లిక్విడ్ గంజాయి పట్టివేత.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్కె.జహరుద్దీన్ లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
ఫర్నిచర్ మాటున గంజాయి రవాణా
కాకినాడ క్రైం: వ్యాన్‌లో ఫర్నిచర్ మాటున దాచి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చింతూరు పరిధిలో ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో శనివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాన్‌ను తనిఖీ చేయగా ఫర్నిచర్ కనిపించింది. వ్యాన్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఫర్నిచర్ అడుగున 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి కూలీలు కాలినడకన సుకుమామిడి ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి వ్యాన్‌లో ఫర్నిచర్ మాటున దాచి, అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సరుకును ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేల్చారు. నిందితులు గౌరవ్ రాణా (23), నౌశద్ (19), ఆరిఫ్ (23)లను అరెస్టు చేశారు. గంజాయితో పాటు, వ్యాన్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పైన బంగాళాదుంపలు.. అడుగున గంజాయి ప్యాకెట్లు
అగనంపూడి (గాజువాక)/యలమంచిలి రూరల్/పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తరలిస్తున్న 790 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్టు చేశారు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాదుంపల లోడు వ్యాన్‌లో అడుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో గురువారం వేకువజామున దువ్వాడ పోలీసులు దాడి చేశారు. అగనంపూడి టోల్‌గేటు వద్ద కాపుకాసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి వీఎస్‌ఈజెడ్‌కు సమీపంలోని డాక్‌యార్డ్ కాలనీలోని స్టాక్ యార్డ్‌కు వీటిని తరలించి తరువాత, అక్కడి నుంచి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్ వేశారు. గురువారంఇదే రీతిలో సరుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి సరుకుతోపాటు తమిళనాడుకు చెందిన భాస్కర్ చంద్రశేఖర్, జాన్సన్ శంకర్‌తోపాటు డాక్‌యార్డ్ కాలనీకి చెందిన దుక్కా నరేష్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ చెప్పారు. ఈ దాడిలో ఎస్ఐ రామదాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆటోలో గంజాయి తరలిస్తుండగా విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద అడ్డుకున్నట్టు యలమంచిలి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పాంగి మహేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలావుండగా.. కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పాయకరావుపేట సమీపంలో పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పాడేరు ఏఎస్పీ జగదీష్.. చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డుడి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని సుమారు 600 మంది విద్యార్థులతో అవగాహన కల్పించారు. పాడేరులో తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను సమావేశపర్చి గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై ఏఎస్పీ అవగాహన కల్పించి .. తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు. అనంతరం ‘గంజాయి సాగు వద్దు–వ్యవసాయమే ముద్దు’ అంటూ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో గిరిజన విద్యార్థులు, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఇతర అధికారులు -
గంజాయి సమస్య కొత్తది కాదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో (ఏవోబీ) గంజాయి సమస్య కొత్తది కాదని, పదిహేనేళ్లుగా కొనసాగుతోందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ గంజాయి సాగుచేస్తున్న విషయం అక్కడి సీనియర్ పోలీసు అధికారులకు, ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఏవోబీ నుంచి గంజాయి రవాణా తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, గంజాయి రవాణా, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టాలని ఆదేశించారని వెల్లడించారు. గడిచిన నెలన్నరలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు. ఏవోబీ నుంచి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని తాము పట్టుకున్న వారి కాల్ డాటా ఆధారంగా గుర్తించామన్నారు. తనిఖీల్లో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి తనిఖీలోనూ గంజాయి మూలాలు ఏవోబీవైపే చూపించాయని, గంజాయి విక్రయదారుల పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగానే దసరా రోజు నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలతో ఏపీలో దాడులు నిర్వహించామన్నారు. దీనికి ఏపీ పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డికి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారంతోనో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఎస్పీ రంగనాథ్ ఆ ప్రకటనలో వివరించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి విషయమై చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరికాదన్నారు. ‘మా భుజాల మీద నుంచి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. గంజాయి ఇష్యూను అక్కడి నాయకులు ఎవరికి అనుగుణంగా వారు అన్వయించుకుంటూ రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవడం సరికాదన్నారు. -
డబ్బుల కోసం వక్రమార్గం
చంద్రగిరి: కొందరు విద్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వక్రమార్గం పట్టారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ వివరాలను తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన 9 మంది యువకులు మంగళవారం ఉదయం నరసింగాపురం రైల్వేస్టేషన్ నుంచి చంద్రగిరికి వస్తున్నారు. వీరిని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్‌కుమార్ నాయక్, హిమబిందు తమ సిబ్బందితో కలిసి ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రేజర్ల జాన్తరుణ్(బీటెక్), దిలీప్‌కుమార్(ఇంటర్), గుణసాగర్(బీకాం), అఖిల్‌రెడ్డి(బీకాం), పెరుగొండ హర్ష(హోటల్ మేనేజ్మెంట్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమ లగేజీ బ్యాగుల్లో దాచిన 5.4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన శ్రావణ్, రాజేష్, రూపేస్, హరీష్‌ల కోసం గాలిస్తున్నారు. వీరిలో కొందరు చదువుకుంటుండగా, మరికొంత మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అభినందించి.. రివార్డులు ప్రకటించారు. -
ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా దాటించేస్తున్నారు
నెల్లూరు (క్రైమ్): ‘బస్సుకు టైం అవుతోంది. త్వరగా సరుకు సర్దుకుని బయల్దేరండి..’ ఈ హడావుడి సాధారణ ప్రయాణికులది ఎంతమాత్రం కాదు. గంజాయిని దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఊర్లు దాటించేస్తున్న స్మగ్లర్లది. ఆర్టీసీ బస్సంత సురక్షితం మరొకటి లేదనుకున్నారో ఏమో.. గంజాయి స్మగ్లర్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. అనుమానం రాకుండా మహిళలకు కమీషన్ ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడటంతో ఈ విషయం అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు శనివారం తెల్లవారుజామున నగరంలో పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు. తిరుపతి వైపు వెళ్తున్న నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తమిళనాడుకు చెందిన కదిరవేలు రోజా, కామాచి, ముత్తు, నాగరాజు, అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌లు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద ఏడు బ్యాగుల్లో ఉన్న 78.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండు సమీపంలో విజయవాడ–నెల్లూరు బస్సులో నుంచి అనుమానాస్పదంగా దిగుతున్న తమిళనాడుకు చెందిన చెల్లాదురై మణిముత్తును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 8.610 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బూదనం టోల్‌ప్లాజా వద్ద కాకినాడ నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీలు చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కాకినాడకు చెందిన ఎం.శ్రీను, ఎ.రాజకుమారి, తమిళనాడుకు చెందిన రాణి రమేష్‌లు పట్టుబడ్డారు. వారి నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు చోట్ల పట్టుబడిన తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు మహిళలుండటం గమనార్హం. వీరందరూ కమీషన్ పద్ధతిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలిపారు. -
కంటైనర్‌లో పైన పైపులు.. కింద గంజాయి!
తణుకు: పీవీసీ పైపుల రవాణా మాటున భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 టన్నుల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు, తణుకు సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మీడియాకు తెలిపారు. తణుకు జాతీయ రహదారిపై మహిళా కళాశాల సమీపంలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీవీసీ పైపుల లోడుతో వెళుతున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. పైపుల కింది భాగంలో ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్‌లో మొత్తం 85 సంచుల్లో నిషేధిత గంజాయిని గుర్తించారు. కర్నాటకలోని బీదర్ జిల్లా ఫరీదాబాద్‌కి చెందిన లారీ డ్రైవర్ రాజప్ప, గుల్బర్గా జిల్లా కుడుమూతికి చెందిన్ క్లీనర్ ఆనంద్‌లను అరెస్ట్ చేశారు. లారీతో పాటు వారి నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
నిత్య పెళ్లికొడుకు :పెళ్లి పేరుతో 9 మంది మహిళలకు వల
-
నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 9 మంది మహిళల్ని మోసగించిన నయవంచకుడి కథ విశాఖలో వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణా చేస్తూ, మహిళలను లోబరచుకుని.. వారిని వ్యభిచారం చేయాలని బెదిరిస్తున్న మోసగాడు అరుణ్‌కుమార్ ఉదంతమిది. ఏ అండా లేని మహిళలను తోడుగా ఉంటానని కొందరిని, పెళ్లి చేసుకుంటానని చెప్పి కొందరిని లోబరచుకున్నాడు. కొందరిని పెళ్లి చేసుకున్నాడు. గంజాయి రవాణా కేసులో, మహిళల్ని మోసగించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడి అరాచకాలను తట్టుకోలేని బాధిత మహిళలు పోలీసుల్ని ఆశ్రయించారు. మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి బండారం బట్టబయలైంది. పోలీసుల విచారణలో అరుణ్‌కుమార్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ధనాల అరుణ్‌కుమార్ (33) చిన్నతనంలోనే విశాఖలో అమ్మమ్మ ఇంటికి వచ్చేశాడు. గంజాయి రవాణా చేయసాగాడు. మహిళలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరచుకునేవాడు. తాను పెద్ద వ్యాపారినని చెప్పి కొందరిని మోసం చేశాడు. తను చెప్పినట్లు వినకపోతే కత్తితో చంపేస్తానని బెదిరించేవాడు. ఇప్పటివరకు 9 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి.. వ్యభిచారం రొంపిలోకి దించే ప్రయత్నం చేశాడు. గతంలో అనకాపల్లికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ఒకసారి, గంజాయి రవాణా కేసులో రెండుసార్లు జైలుకి వెళ్లాడు. గతంలో మహిళల అక్రమ రవాణా కేసులో కూడా నిందితుడు. అరుణ్‌కుమార్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులు వీరే.. నర్సీపట్నంలో ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల మహిళకు గంజాయి వ్యాపారం అలవాటు చేసి భర్త నుంచి దూరం చేశాడు. వ్యాపారంలో వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. చింతపల్లి సమీప గ్రామంలో 18 ఏళ్ల యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు సంపాదించమంటూ ఒత్తిడి తెచ్చిన అతడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందింది. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుండడంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. మృతిచెందిన తన స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తాననడంతో ఆమె కూడా మహిళా సంఘాలకు తన కష్టాన్ని తెలిపింది. వీరే కాకుండా మరో నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, వ్యభిచారం చేయమని వేధిస్తున్నాడు. బాధిత మహిళలతో కలిసి బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ.. నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకాధికారితో విచారణ మార్చి 18న వాట్సాప్ ద్వారా సీపీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు వచ్చింది. కంట్రోల్ రూమ్ నుంచి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కి కేసు పంపించారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెం.207/2021 నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 18న అరుణ్‌కుమార్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, గంజాయి రవాణా కేసులో అరుణ్‌కుమార్‌ను 2020 జూలైలో అనకాపల్లి టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి, నర్సీపట్నంలో అమ్మాయిలను మోసం చేసిన కేసులో అరెస్టయి.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగిని నియమించాం. – మనీష్‌కుమార్ సిన్హా, విశాఖ సీపీ -
పర్యాటక ముసుగులో గం‘జాయ్’!
- పంథామార్చిన స్మగ్లర్లు - ఆధునిక కార్లే రవాణా సాధనాలు పాడేరు : ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో గత ఏడాది సాగు చేసిన గంజాయి నిల్వలు భారీగా పేరుకుపోవడంతో వ్యాపారులంతా పలు రకాల మార్గాల్లో వీటిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి ప్రాంతాలు పర్యాటకంగా పేరొందడంతో పర్యాటక ముసుగులో తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారులు ఆధునిక కార్లు, మినీ వ్యాన్లనే రవాణా సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పర్యాటకులు మాదిరిగా ఏజెన్సీలో సంచరిస్తూ గంజాయి మూటలను కార్లు, వ్యాన్లలో అమర్చి అరకులోయ, అనంతగిరి ఘాట్ ప్రాంతాల మీదుగా విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల పాడేరు నుంచి అరకుపోయే మార్గంలో గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు కూడా సమాచారం అందింది. నర్సీపట్నం, పాడేరు రూట్లలో పోలీసు, ఎక్సైజ్ అధికారుల నిఘా అధికంగా ఉండటంతో వ్యాపారులంతా తమకు కలిసొస్తున్న అరకు, అనంతగిరి మార్గాన్నే ఎంచుకుంటున్నారు. పెదబయలు సమీపంలోని మత్స్యగెడ్డ వద్ద నాటు పడవల ద్వారా గంజాయి మూటలను అవతల ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ఒడిశాలోని పాడువా, చటువా మీదుగా అరకు ప్రాంతానికి ఈ కార్లలో గంజాయిని తరలిస్తున్న ముఠాలు కూడా అధికమయ్యాయి. కొత్త, కొత్త కార్లు కావడంతో పోలీసు, ఎక్సైజ్ అధికారులకు కూడా అనుమానం రావడం లేదు. ఈ వాహనాల్లో మహిళలు కూడా ప్రయాణిస్తుండటంతో పర్యాటకులుగానే పలువురు భావిస్తున్నారు. పగటి వేళల్లోనే గంజాయి రవాణా అధికంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అరకులోయ మండల కేంద్రంలో ఓ పెద్ద గంజాయి ముఠా కూడా మకాం వేసి పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మారుమూల ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి రవాణా చేస్తున్నట్టు సమాచారం. అరకులోయలో పర్యాటకులు అధికంగా సంచరిస్తుండటంతో గంజాయి వ్యాపారులు తిరుగుతున్నా ఎవరికీ అనుమానం రావడం లేదు. అలాగే రాత్రి వేళల్లో కూడా గంజాయి రవాణాతో వాహనాలు అధికంగా సంచరిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు అరకు, అనంతగిరి మార్గంలో పర్యాటకుల వాహనాలను కూడా తనిఖీ చేస్తే మరింత గంజాయి రవాణా వెలుగు చూసే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.