పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌ఈబీ అధికారులు
నెల్లూరు (క్రైమ్): ‘బస్సుకు టైం అవుతోంది. త్వరగా సరుకు సర్దుకుని బయల్దేరండి..’ ఈ హడావుడి సాధారణ ప్రయాణికులది ఎంతమాత్రం కాదు. గంజాయిని దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఊర్లు దాటించేస్తున్న స్మగ్లర్లది. ఆర్టీసీ బస్సంత సురక్షితం మరొకటి లేదనుకున్నారో ఏమో.. గంజాయి స్మగ్లర్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. అనుమానం రాకుండా మహిళలకు కమీషన్ ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడటంతో ఈ విషయం అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు శనివారం తెల్లవారుజామున నగరంలో పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు. తిరుపతి వైపు వెళ్తున్న నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తమిళనాడుకు చెందిన కదిరవేలు రోజా, కామాచి, ముత్తు, నాగరాజు, అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌లు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.
వారి వద్ద ఏడు బ్యాగుల్లో ఉన్న 78.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండు సమీపంలో విజయవాడ–నెల్లూరు బస్సులో నుంచి అనుమానాస్పదంగా దిగుతున్న తమిళనాడుకు చెందిన చెల్లాదురై మణిముత్తును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 8.610 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బూదనం టోల్‌ప్లాజా వద్ద కాకినాడ నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీలు చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కాకినాడకు చెందిన ఎం.శ్రీను, ఎ.రాజకుమారి, తమిళనాడుకు చెందిన రాణి రమేష్‌లు పట్టుబడ్డారు. వారి నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు చోట్ల పట్టుబడిన తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు మహిళలుండటం గమనార్హం. వీరందరూ కమీషన్ పద్ధతిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment