పట్టుబడిన గంజాయి, నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలోని జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.70 కోట్ల విలువ చేసే సుమారు 1,732 కేజీల గంజాయిని కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు పరారైనట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఎన్‌హెచ్ 16పై బూరుగుపూడి శివారు పోలవరం కాలువ వంతెన వద్ద జగ్గంపేట సీఐ వి.సురేష్‌బాబు, కిర్లంపూడి ఎస్సై జి.అప్పలరాజులు వాహనాలు తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయ్యింది.
అన్నవరం వైపు నుంచి కోళ్ల మేత, ట్రేల లోడుతో వస్తున్న అశోకా లేలాండ్ వ్యాన్‌లో 10 బస్తాల గంజాయి, తాళ్లరేవుకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్‌లో 30 బస్తాల్లో ఉన్న గంజాయి వెరసి 40 బస్తాల్లో ఉన్న 1731.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తమిళనాడుకు చెందిన కాశీ మాయన్ కుమార్, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ డ్రైవర్ సున్నపు రాజు, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ క్లీనరు వాసంశెట్టి వీరబాబు, విశాఖ జిల్లా చింతపల్లి మండలం పనసలపాడు గ్రామానికి చెందిన కొర్ర ప్రసాద్, విశాఖ జిల్లా జి.కొత్త వీధి మండలం ఎబులం గ్రామానికి చెందిన గొల్లోరి హరిబాబులను అరెస్టు చేశారు.
రెండు వ్యాన్లతో పాటు నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన ఒకరు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment