
ఇవి తప్ప మీరేం చేస్తున్నారు?
దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు?
కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు
ఇలాంటి తీరును సహించేదే లేదు
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారు... అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప, ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది.
బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే, ఆ వివరాలను తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టే, ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ కేసుల్లో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్ట్ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తాము ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది.
తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్ట్ విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం కమిషనర్‌లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బొసా లక్ష్మి పిటిషన్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను కొద్దికాలం కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్ట్ విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ల వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వారు కోర్టుకు చెప్పారు. ఇచ్ఛాపురం పోలీసులు మరో కేసులో రమణను అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో హైకోర్టు ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అనంతరం ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిన్నం నాయుడు, పొదిలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కోర్టు ముందు హాజరైన ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు...
లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ధర్మాసనం ఆదేశాల మేరకు సీఐలు చిన్నం నాయుడు, వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. రమణను తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది.
ఇలాంటి నిర్లక్ష్యపు తీరును తాము ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పొదిలి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ, బొసా రమణపై 27 కేసులున్నాయని తెలిపారు. రమణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం మినహా దర్యాప్తు చేయడం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment