![Andhra Pradesh High Court fires on police department](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/HIGH_COURT_OF_ANDHRA_.jpg.webp?itok=bceh_9Ee)
పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండటమే కాక, నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరు పరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళుతుండటం సరికాదని హెచ్చరించింది.
రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా.. అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజి్రస్టేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరు పరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని.. దీనిపై కోర్టు సమయం వృథా చేసుకోరాదంటూ ఇచ్ఛాపురం ఇన్‌స్పెక్టర్ చిన్నం నాయుడు తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది.
పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? అంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు (కక్షిదారులు) ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు (అధికారుల వైపు) ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒక్కటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్‌పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వాంగ్మూలం నమోదు చేశాక మళ్లీ నోటీసా?
⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కు చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బొసా లక్ష్మీ తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
⇒ ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి మాత్రం రమణ పోలీసుల అక్రమ నిర్బంధంలోనే ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరు పరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్‌పీ, పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌లను ఆదేశించింది.
⇒ నవంబర్ 13న కేసు విచారణకు రాగా, రమణను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను స్థానిక కోర్టు ముందు హాజరు పరచగా, కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి, ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్‌హెచ్‌వోలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసి, అనంతరం విడిచి పెట్టామని పొదిలి ఎస్‌హెచ్‌వో చెప్పారు.
⇒ తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్‌హెచ్‌వో తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదంది. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి, ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి, ఇలా వదిలేశామని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. అరెస్ట్, విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్‌పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment