విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట దహనం
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది.
ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్‌ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది.
మ్యాపింగ్‌తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు
‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్‌ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు.
ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో..
ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్‌ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్‌ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్‌ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు అంచనా.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ..
రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్‌ఈబీ అధికారులు అందిస్తారు.
విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం
గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ
మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా డాగ్‌స్క్వాడ్ తనిఖీలు జరిగాయి.
18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్‌ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్‌ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment