రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా? | Kurasala Kannababu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా?

Published Sun, Oct 24 2021 2:51 AM | Last Updated on Sun, Oct 24 2021 4:58 AM

Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించేందుకు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని జాతీయ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రశంసిస్తుంటే.. డ్రగ్స్‌ అంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారిపోయిందని ఆరోపిస్తావా? సీఎం వైఎస్‌ జగన్‌పై కోపంతో రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా? మీ మాటలు విని ఇతర రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర ప్రజల గురించి ఏమనుకుంటారు?’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సకల దరిద్రాలకు మూలాలు టీడీపీలోనే ఉన్నాయని, గంజాయి స్మగ్లింగ్‌లోనూ ఆ పార్టీ నేతలే కన్పిస్తారని చెప్పారు.   మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..

ఎవరికి భ్రమలు కల్పించాలని ఈ దొంగ దీక్ష?
► రాష్ట్రంలో అలజడి సృష్టించి.. శాంతిభద్రతలు అదుపులో లేవని విష ప్రచారం చేయడం కోసం చంద్రబాబు కుట్రకు తెరతీశారు. ఆ కుట్రలో భాగంగా తానే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తూ ఒక స్కిట్‌ నడిపించారు. బజారు భాష మాట్లాడే అధికార ప్రతినిధిని పెట్టి.. సీఎం వైఎస్‌ జగన్‌ను, ఆయన తల్లిని కించపరిచే విధంగా బూతులు తిట్టించారు.
► సీఎం వైఎస్‌ జగన్‌ను అభిమానించే ప్రజలు టీడీపీ కార్యాలయం మీదకు వెళ్తే.. దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడానికే.. ముసలి కొంగ నాలుగు చేపల కోసం జపం చేసినట్లుగా చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం 36 గంటలపాటు దొంగ దీక్ష చేశారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తెలియక.. మరో నాయకుడిని అడగడం ప్రజలందరూ చూశారు.
► తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ లేదు.. బొక్కా లేదని.. అచ్చెన్నాయుడు స్వయంగా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ బతికే ఉందని కార్యకర్తల్లో భ్రమ కల్పించడానికే  చంద్రబాబు ఈ డ్రామా ఆడారు. 

ఢిల్లీ వెళ్లి ఏమని చెబుతావ్‌..
► ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోదీ, అమిత్‌ షాలకు ఏమని చెబుతారు? సీఎం వైఎస్‌ జగన్‌ను బోషడీకే అని తిట్టేస్తే.. ఈ దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతావా? టీడీపీ నేతలు చెబుతున్నట్లు బోషడీకే అనే పదానికి బాగున్నారా.. అనే అర్థం ఉంటే.. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్‌ షాలను కలిసినప్పుడు బాగున్నారా అని అడగడానికి బోషడీకే అని సంభోదిస్తారా? ఆ పదంతో సంభోదిస్తే ఢిల్లీలో ఎవరైనా చెప్పు తీసుకుని కొడతారు చంద్రబాబూ. 
► అమిత్‌ షాను ఏ మొహం పెట్టుకుని కలుస్తావ్‌? కుటుంబ సభ్యులతో తిరుపతికి వచ్చినప్పుడు టీడీపీ గూండాలతో తన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయించింది అమిత్‌ షాకు తెలియదా? అప్పట్లో నువ్వు  మాట్లాడిన మాటలు ఆయనకు గుర్తుకురావా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వనన్నావు.. ఇప్పుడు నీకు అదే సీబీఐ కావాల్సి వచ్చిందా?  

దేవుడిపై చెప్పులేసి.. దేవాలయంలో బూతులా? 
► టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్నారు. దేవాలయంపై దాడి చేస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆపార్టీని స్థాపించిన దేవుడు ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేసింది చంద్రబాబుకు గుర్తు లేదా? పట్టాభి బూతు వ్యాఖ్యకు క్షమాపణ చెప్పకుండా.. ఆ పార్టీ నేతలతో అలాంటి బూతులనే తిట్టించారు. దేవాలయంలో మంత్రాలు చదువుతారు గానీ.. బూతులు మాట్లాడరు కదా? పైగా ఆ బూతులను ఇప్పటికీ సమర్థించుకుంటోన్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు సిగ్గులేదా? 
► దొంగ దీక్షలో లోకేష్‌ ప్రసంగాలు చూస్తే.. సినిమాల్లో బ్రహ్మానందంలా మంచి టైమింగ్‌తో కామెడీని పండించారు. దుగ్గిరాలలో ఎంపీటీసీలు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి నాన్న చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తామని లోకేష్‌ చెప్పాడు. ఏ కొడుకైనా పార్టీని గెలిపించి, అధికారాన్ని గిఫ్ట్‌గా ఇస్తామని తండ్రికి చెబుతారు. ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబే ప్రకటించారు. మరి దుగ్గిరాలలో టీడీపీ అభ్యర్థులకు బీ–ఫారమ్‌ ఎవరిచ్చారు? ఈ మాటలు విని చంద్రబాబు కుమిలిపోయి ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు.

పేదల అభ్యున్నతికి అడ్డు పడతారా? 
► చంద్రబాబూ.. ప్రభుత్వంపై ఉగ్రవాదుల్లా విరుచుకుపడుతున్నది నువ్వు, నీ పార్టీ నేతలు కదా? పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలను దక్కనివ్వకుండా కోర్టులకు వెళ్లిందెవరు?  అన్ని మంచి పనులకు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు.
► ఇటీవల వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మహిళలకు రూ.6,400 కోట్లు విడుదల చేయడంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇప్పుడు ఈ డ్రామా ఆడారు. చంద్రబాబులా ఏ ప్రభుత్వ రంగ సంస్థనూ సీఎం వైఎస్‌ జగన్‌ మూసి వేయరు. యాంత్రీకరణ ద్వారా ఆగ్రోస్‌ను మరింత బలోపేతం చేస్తారు. 

చంద్రబాబా.. చందాల బాబా..
► టీడీపీ జాతీయ పార్టీ అయితే.. రెండు రాష్ట్రాల్లోని బద్వేలు, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? దీక్ష సమయంలో టీడీపీ నేతలు నోట్ల కట్టలిస్తూ, పాద నమస్కారాలు చేస్తుంటే.. చంద్రబాబా? లేక చందా బాబా అనే అనుమానం ఎవరికైనా కలుగుతోంది. మిమ్మల్ని ఏమని పిలవాలి? చందాల బాబా అనా? చంద్రబాబా అనా? మీ యావ ఎప్పుడూ డబ్బులపైనే? 
► అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లో వైఎస్సార్‌సీపీ కార్యాకర్తలను వెతికి వెతికి చంపి.. కక్షను వడ్డీతో సహా తీర్చుకుంటామంటారా? ఎవరైనా ప్రజా సేవ కోసం అధికారం ఇవ్వండని ప్రజలను అడుగుతారు. మీరు కక్ష తీర్చుకోవడానికి అధికారాన్ని అప్పగించండని అడుగుతారా? సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ముందు కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి చూద్దాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement