సాక్షి, కాకినాడ: సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాజా విజన్-2047 ఆచరణకు పనికి రాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని, గతంలో ఆయన ప్రకటించిన రెండు విజన్లలోని లక్ష్యాలను ఏ మేరకు సాకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
కొత్తసీసాలో... పాతసారా
గతంలో చంద్రబాబు రెండుసార్లు విజన్ డాక్యుమెంట్‌లను రిలీజ్ చేశాడు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశాడు. ఈ దేశంలో తానే ఒక గొప్ప విజనరీగా భ్రమపడే చంద్రబాబు, ప్రజలను కూడా తన పబ్లిసిటీ స్టంట్‌లతో భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ తాజా విజన్ 2047 డాక్యుమెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా.
1995-2004 మధ్య, 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు ప్రకటించిన రెండు విజన్‌లలో ఒక్క లక్ష్యాన్ని అయినా సాధించిన దాఖలాలే లేవు. చంద్రబాబు తాజాగా విజన్-2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైనే ప్రచారం చేసుకుంటున్నాడు. జనాలను మభ్యపెట్టడం ఎలా అనే అంశంపై చంద్రబాబు పుస్తకం రాస్తే, ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అది అమ్ముడు పోతుంది. ప్రజలకు ఏం కావాలనేది ఆయనకు అక్కరలేదు. కానీ వారిని భ్రమల్లో ఉంచడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం ఎవరికీ లేదు. దానిలో భాగమే ఈ తాజా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
'విజన్-2020 చంద్రబాబు-420'
చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్‌లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు. గతంలో ఆయన ప్రకటించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన కమ్యూనిస్ట్ లు విజన్-2020 చంద్రబాబు-420 అనే నినాదం కూడా చేసేవారు. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆనాడు ఎలా ఆలోచించాడో, నేడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు విజన్-2047 అంటూ కొత్త రాగాన్ని ఆలపిస్తే, కూటమిలోని భాగస్వాములు దానికి తప్పెట్లు, తాళాలతో ఆయన చాలా గొప్పనాయకుడు, వంద ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలని కీర్తిస్తున్నారు.
ప్రజాశ్రేయస్సుకు దూరంగా చంద్రబాబు విజన్
2024లో ప్రజలు చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేయాలి, వారి అవసరాలు ఏమిటీ అని ఆలోచించకుండా విజన్ 2020లో ఏం చెప్పారో ఇప్పుడు 2047 విజన్‌లోనూ అవే చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో నేటికీ తాగునీరు అందని గ్రామాలు, విద్య, వైద్యం, రహదారులు, కరెంట్, కనీస సదుపాయాలు లేని పల్లెలు ఉన్నాయంటే అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది ఎలాంటి విజన్? కనీస అవసరాలు తీర్చే విజన్ లేకుండా, తనకు తానే భ్రమల్లోకి వెళ్ళి ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టడం సమంజసమా? విజన్ 2020 తరువాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి 2.4 శాతం నుంచి 0.29 శాతానికి పడిపోయింది, రాష్ట్ర జీడీపీ ఏకంగా 5 శాతం లోపే నమోదు అయిన విషయం వాస్తవం కాదా?
సూపర్ సిక్స్ హామీల అమలుపై మీ ప్రణాళిక ఏదీ?
వరుసగా విజన్ లను ప్రకటిస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకు రావడం లేదు. సూపర్ సిక్స్ అని ఇచ్చిన హామీల్లో ఒక్క పథకంలోనూ ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేశారు. రైతులను ఆదుకోవాలనే విజన్ అంతకన్నా లేదు. 2014 కి ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. వ్యవసాయమే దండుగ అనే విధంగా పాలన సాగించారు. నేడు మళ్ళీ సీఎంగా అధికారంలోకి రావడానికి రైతులకు రూ.20 వేల సాయం అంటూ హామీ ఇచ్చారు. దానిని కూడా ఆరునెలలైన అమలు చేయడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు, గిట్టుబాటు ధర కల్పించడం లేదు. నిలువునా రైతులను దగా చేస్తున్న మీరు విజన్ 2047లో రైతులను ఉద్దరిస్తానని చెబుతుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు.
విద్య-వైద్య రంగాలపై చంద్రబాబు విజన్ అధ్వాన్నం
ఈ రోజు మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలు కోరుతుంటే... 2047లో పరవాణ్ణం పెడతానని చంద్రబాబు ఊరిస్తున్నాడు. పేదరికం వల్ల ఇబ్బంది పడకూడదని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను తీసుకువచ్చారు. విద్యా, వైద్యరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అదే ఒరవడిని సీఎంగా వైఎస్ జగన్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయడం లేదు. జగన్ సీఎం అయ్యే వరకు పాఠశాలలకు సరిపడిన భవనాలు లేవు, పిల్లలు కూర్చునేందుకు బెంచీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకునేందుకు టాయిలెట్లు లేవు, కనీసం చాక్ పీస్ లు కూడా లేవు.
పాఠశాలలను తీర్చిదిద్దాలనే విజన్ ఏనాడైనా చంద్రబాబుకు ఉందా? విద్యను, వైద్య రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే ప్రాజెక్ట్‌లను తీసుకు రాకుండా, తాను విజనరీని అని చంద్రబాబు ఎలా చెప్పుకుంటారు? కాకినాడ జనరల్ ఆసుపత్రిలో సరిపడా ఇన్సులిన్ లేదు. ఇది మీ ప్రభుత్వ పరిస్థితి. మేం వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో గ్రామస్థాయిలో సరిపడినన్ని మందులతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తే, చంద్రబాబు సీఎం కాగానే దానికి మంగళం పాడారు. అటువంటి మీరు విజన్ ద్వారా అభివృద్ధిని, సంతోషాన్ని ఇస్తానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
విజన్-2020 ద్వారా ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారు
1998లో చంద్రబాబు ప్రభుత్వం మెకన్సీ అనే విదేశీ కన్సల్టెన్సీకి దాదాపు రూ.2.5 కోట్లు చెల్లించి విజన్ 2020 రూపొందించుకున్నారు. దీనిని చూసి ప్రపంచంలోని నిపుణులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు ప్రపంచంలోని ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు, సీఈఓను అని ప్రకటించుకున్నారు. మెకన్సీ చేసిన విజన్-2020 డాక్యుమెంట్ చూస్తే విద్యా, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసి, ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించారు. అంటే ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్యంను అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటువారికి ఇవ్వాలనే లక్ష్యం మీకు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇదేనా మీ విజన్? స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా పేదలకు చేరువ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు కూడా ఉన్నత విద్యను అందించారు. ఇది కాదా నిజమైన విజన్ అంటే?
ప్రజాభాగస్వామ్యం లేని విజన్ ఇది
చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్ లో ప్రజాభాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలోని మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? రైతులు, ప్రజల ముందు పెట్టి వారి అభిప్రాయాలు కోరారా? దీనిపై ఎక్కడైనా చర్చకు పెట్టారా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు చెందిన ఎన్జీఓ సంస్థలతో ఈ విజన్ తయారు చేయించారు. అంతేకానీ నిజంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి లక్ష్యాలు ఉండాలి అనే ఆలోచనలు దీనిలో లేవు. గతంలో విజన్ 2020 ప్రకటించిన తరువాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు.
విద్యుత్ రేట్లను పెంచడం, అడిగిన రైతులపై కాల్పులు చేయించారు. ఆనాడే కమ్యూనిస్ట్ లు చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడ మళ్ళీ విజన్ 2047 అంటున్నాడు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి ఒక్క పోర్ట్ అయినా కట్టాడా? ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాడా? తెచ్చిన ఒక కాకినాడ సీపోర్ట్ ఎడిబి రుణంతో నిర్మించి, తర్వాత తనకు కావాల్సిన వారికి దారాదత్తం చేశారు. జగన్ గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, అందులో 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నాడు. మాకు మెడికల్ కాలేజీ సీట్లువద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబుది విజనా? వైద్యవిద్య ఈ రాష్ట్రంలో బలపడాలన్న లక్ష్యంతో పనిచేసిన వైఎస్ జగన్‌ది విజనా?
చంద్రబాబు విజన్ పేదవారి పాలిట శాపం
వైఎస్ జగన్ గ్రామస్థాయిలోకి పాలన వెళ్ళాలని వాలంటీర్లు, సచివాలయాలను తీసుకువస్తే, వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబుది ఎటువంటి విజన్? 2020 డాక్యుమెంట్ లో ఏ లక్ష్యాలను సాధించారు? 2047లో పదిసూత్రాలు అంటున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెడితే నవ్వుతారు. పండిన ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించలేని మీరు సెకండరీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికా, పెంచడానికా మీ విజన్? జగన్ గారు అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇలా సంక్షేమ పథకాలను అయలు చేస్తే, మీరు మాత్రం వాటిని పక్కకుపెట్టారు.
వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం, ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఇది చంద్రబాబు విజన్. సంపద సృష్టి ఎవరికోసం చేస్తున్నారు. మీ కోసం సంపదను మీరే సృష్టించుకుంటున్నారు. అంతేకానీ ప్రజలకు సంపదను సృష్టించే ప్రయత్నం చేయడం లేదు. పైగా వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా రూ.15వేల కోట్లు ప్రజలపై భారం వేయడాన్ని సంపద సృష్టి అంటారా? ఈ రోజు పంచాయతీల్లో పన్నులను పెంచి ప్రజలపై భారం వేయబోతున్నారు.
14 ఏళ్లు చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటు
ఎంతో విజన్ ఉన్న చంద్రబాబు తన పాలన 14 ఏళ్ళలో ప్రతిఏటా రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇన్ని సంవత్సరాల పాటు రెవెన్యూ లోటు మరే ప్రభుత్వంలోనూ లేదు. ఇదేనా మీ పాలనా సామర్థ్యం? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక ఐఎఎస్ అధికారి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15వేల కోట్లు రుణం మంజూరయ్యింది. దీనిలో 3700 కోట్లు ముందే వచ్చేస్తుంది, దీనితో అమరావతిలో పనులు వెంటనే ప్రారంభించవచ్చు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. రూ.15 వేల కోట్ల అప్పు దొరికిందని ఆనందిస్తున్నారే కానీ, పేదలకు పదిరూపాయలు ఖర్చు చేయడంలో ఉన్న ఆనందాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులను సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. మీ ప్రభుత్వంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులపై బెదరింపులు, వేధింపులే. కలెక్టర్ లను బెదిరిస్తున్నారు. సెన్సేషనలిజంను ఈ ప్రభుత్వం నమ్ముకుంది. తిరుపతి లడ్డూ, కాకినాడ పోర్ట్, రేషన్ బియ్యం ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్లడం, దానిపై ప్రజలకు అబద్దాలు చెబుతూ మభ్య పెట్టడంను ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారు. మంచి జరిగితే మాదే అంటున్నారు. సరిగా జరగకపోతే అధికారుల వైఫల్యం అంటారా?
చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన లేదు
అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల్లో రూ.70 వేల కోట్లు అప్పులు తెచ్చారు. దానిలో కనీసం ఇంత మొత్తం మా హామీల కోసం ప్రజలకు ఖర్చు చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. వైయస్ఆర్ సిపి కార్యకర్తలపైనా, సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. జగన్ గారిని విమర్శించే వారిపై ఫిర్యాదు చేసినా మీ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కేసు కూడా రిజిస్టర్ చేయడం లేదు. ఇదేనా మీ రూల్ ఆఫ్ లా. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసే నాయకులపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడుకుంటున్నారు. స్టేజీపై మీ మాటలకు, చేతలకు పొంతన లేదు. అలాంటి మీరు ప్రకటించే విజన్ ఎంత వరకు ఆచరణాత్మకంగా ఉంటుంది?
2047 వరకు మీరే అధికారంలో ఉంటారా?
విజన్ 2047 వరకు అధికారంలో మీరు ఉంటారా? ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చూడండి. తరువాత కలలు కనండి. ప్రణాళికలతోనే సరిపెట్టకూడదు, అమలు కూడా చూడాలి. అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై మీ ప్రణాళిక ఏమిటో బయటపెట్టండి. కనీసం మీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వార్షికోత్సవంలో అయినా వెల్లడించండి. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీకి దిక్కులేదు, విజన్ 2047 అంటున్నారు. ఇదంతా డ్రామా కాదా?
సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర
సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపులో భాగంగానే జరిగింది. శుక్రవారంనాడు అరెస్ట్ చేసి జైలుకు పంపి కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా ఉండే కుట్ర దీనిలో ఉంది. ఆయన వెళ్ళిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు గాయపడటం బాధాకరం. అయితే ఈ సంఘటనకు తెలంగాణ పోలీస్ వైఫల్యం లేదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం లేదా? అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో మీరు చూపించిన శ్రద్ద మీ యంత్రాంగం వైఫల్యంపైఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నాం.
రాజమండ్రి తొక్కిసలాటకు చంద్రబాబును బాధ్యుడిని చేయలేదే
గతంలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటల్లో చాలా ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలను అడ్డం పెట్టుకుని కక్షసాధించే విధంగా చర్యలు తీసుకుంటే ఆనాడు రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన ఘటనలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండేవారు కాదా? ఆ ఘటనలో 27 మంది చనిపోయారు. కనీసం నా వల్ల తప్పు జరిగిందనే పశ్చాత్తాపం కూడా చంద్రబాబు వెల్లడించలేదు. ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదు.
అసలు ఆ సంఘటనకు ఎవరూ బాధ్యులే లేరా? అంతేకాదు గత ఎన్నికల్లో గుంటూరులో చంద్రబాబు సభలో చీరెలు పంచడానికి వెడితే తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఒక ఇరుకు సందులో జనం కనిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సభ పెడితే కాలువలో పడి ఎనిమిది మంది మరణించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ ఘటనల్లో ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? ఇవి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలు, వీటిని తమకు గిట్టని వారికి వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయించే సందర్భాలుగా మలుచుకోవడం బాధాకరం.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే ఇది
అల్లు అర్జున్ హీరో నటించిన సినిమా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. ఆయన ఒక థియేటర్ కు వస్తున్నాడు అంటే పోలీసులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. మామూలు వస్త్రాలయాల ప్రారంభోత్సవాలకు సినిమా నటులు వస్తున్నారంటేనే రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి. సినీ నటులపై ప్రజల్లో క్రేజ్ ఉంది. అటువంటి సందర్భంలో ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి. తొక్కిసలాట జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేయాలి.
దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్ట ప్రకారం అరెస్ట్ చేసే ముందు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారా, ముందస్తు విచారణకు పిలిచారా? ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసినట్లు కాదా? దీనిని మాజీ సీఎం జగన్ గారు తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియా కూడా ఇది తప్పు అని చెబుతోంది. కేంద్రంలోని మంత్రులు కూడా దీనిని ఖండించారు.
సెన్సెషనలిజం కోసమే పాలకుల చర్యలు
అల్లు అర్జున్ అరెస్ట్ ను సెన్సేషనలిజం కోసమే చేసినట్లు కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్, ఇక్కడ సోషల్ మీడియా యాక్టివీస్ట్ ల అరెస్ట్ లు ఒకేరకంగా సాగుతున్నాయి. ఈ విధానాలు సరైనవి కావు.
Comments
Please login to add a commentAdd a comment