గంజాయి స్మగ్లర్లను తప్పించేందుకు.. పేట్రేగిన ‘పచ్చ’ మూకలు | TDP Leaders Over Action At Chittoor | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్లను తప్పించేందుకు.. పేట్రేగిన ‘పచ్చ’ మూకలు

Published Sat, Jun 25 2022 2:28 AM | Last Updated on Sat, Jun 25 2022 2:28 AM

TDP Leaders Over Action At Chittoor - Sakshi

పోలీసులతో వాదిస్తున్న మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, దొరబాబు, నాని తదితరులు

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలో గత రెండ్రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ నేతల ఆగడాలు వారి నాటకాలను బట్టబయలు చేసింది. గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారు నిందితుడ్ని తప్పించడం.. మాజీ మేయర్‌ హేమలతను పోలీసు జీపు పొరపాటున ఢీకొట్టడం.. దీనికి ప్రతిగా పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేకున్నా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఈ మొత్తం వివాదాన్ని సీఎంకు ఆపాదిస్తూ ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా మారింది.

ఏం జరిగిందంటే..?
ఈ వివాదానికి సంబంధించి పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేట సాయినగర్‌కు చెందిన పూర్ణ గంజాయి తెప్పించి విక్రయిస్తున్నట్లు టూటౌన్‌ సీఐ యతీంద్రకు గురువారం రాత్రి సమాచారం అందింది. తన సిబ్బందితో వెళ్లిన యతీంద్ర.. పూర్ణ నివాసంలో తనిఖీలుచేస్తే రెండు కిలోల గంజాయి లభించింది. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తే ఓబనపల్లె వద్ద ఉన్న తన సమీప బంధువు ప్రసన్న అనే వ్యక్తి గంజాయి విక్రయించాలని తనకు ఇస్తే, తాను విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. ప్రసన్న ఇంట్లో 18 కిలోల గంజాయి లభించింది. దీంతో.. ప్రసన్న ప్రధాన నిందితుడిగా, పూర్ణ రెండో నిందితుడిగా పోలీసులు కేసు నమోదుచేశారు.

పోలీసులు పూర్ణ, గంజాయిని తీసుకెళ్తుండగా మాజీ మేయర్, టీడీపీ నాయకురాలు హేమలత, కంద, గోపి, కిషోర్‌ తదితరులు ఓబనపల్లె బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. మాజీ మేయర్‌ అనురాధ, మోహన్‌ జంట హత్యల కేసులో పూర్ణ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. పూర్ణను పోలీసులు తీసుకెళ్లకుండా హేమలత జీపు వెనుక బైఠాయించారు.

దాదాపు 40 మంది వరకు ఘటనలో గుమికూడటంతో పూర్ణను తీసుకెళ్తున్న పోలీసు జీపు రివర్స్‌ చేస్తుండగా పొరపాటున హేమలతను ఢీకొట్టింది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పూర్ణను తప్పించేశారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి, జీపు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు 10మందికి పైగా హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పట్టుబడ్డ పూర్ణను పోలీసు జీపు నుంచి తప్పిస్తున్న టీడీపీ శ్రేణులు 

హాస్యాస్పదంగా చంద్రబాబు ట్వీట్లు
వాస్తవానికి.. కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ 2015లో హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసు ట్రయల్‌ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. సాక్షులను కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇందులో వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఎలాంటి సంబంధంలేదని కటారి కుటుంబం రెండ్రోజుల ముందు మీడియాకు చెప్పింది. కానీ, హేమలతపైకి కారు ఎక్కించడం, పూర్ణ ఇంట్లో గంజాయి దొరకడం అన్నీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతోనే అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. ఈ ఘటనను పూర్తిగా రాజకీయం చేయడానికి మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, టీడీపీ నేతలు నాని, దొరబాబు తదితరులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎవరినీ ఉపేక్షించేది లేదు
హేమలతపై కావాలనే కారు ఎక్కించారని టీడీపీ వారు ఫిర్యాదు చేశారు. వాళ్లిచ్చిన వీడియోలు చూస్తే డ్రైవర్‌ చూసుకోకుండా వెనక్కి రివర్స్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక పోలీసు కస్టడీలో ఉన్న గంజాయి స్మగ్లర్‌ పూర్ణను తప్పించడం, గంజాయిని పారపోయడం.. పోలీసు జీపు ధ్వంసం చేయడం సరైన పద్ధతికాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ ఉపేక్షించం. కఠినంగా వ్యవహరిస్తాం. పోలీసులపై భౌతిక దాడికి పాల్పడి ఔట్‌ఆఫ్‌లాగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తేలేదు. జంట హత్యల కేసులో సాక్షులుగా ఉన్న వారికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తాం. కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పేందుకు చర్యలు తీసుకుంటాం.
– రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement