సాక్షి, అమరావతి: ‘గంజాయిలో టాప్’ అనటానికి... ‘గంజాయిని నిరోధించటంలో టాప్’ అనటానికి తేడా లేదా? ఈ తేడా ‘ఈనాడు’ పత్రికకో, దాని అధిపతి రామోజీరావుకో తెలియదా? తెలియకేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్నది తమ బాబు కాదు కాబట్టి... ఎంత వీలైతే అంత బురద జల్లాలి. నిజాలు చెప్పి బురద జల్లలేరు కాబట్టి... వీలైనంత తప్పుదోవ పట్టించాలి. గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. దేశవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడే ఈ ఏడాది ఎక్కువ గంజాయిని పట్టుకున్నారని, ఎక్కువ కేసులు పెట్టారని, ఎక్కువ విస్తీర్ణంలో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారని జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక ఇచ్చింది.
షరామామూలుగా ‘ఈనాడు’ తన పైత్యాన్ని జోడించి ‘గంజాయిలో ఏపీ టాప్’ అని శీర్షిక పెట్టేసింది. లోపల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికలోని అంశాలనే పేర్కొంది. నిజానికి గంజాయి సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉన్నా... వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే దీనిపై సమగ్ర కార్యాచరణ మొదలెట్టింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటంతో పాటు... గంజాయి సాగుకు అలవాటుపడ్డ గిరిజనుల్ని మార్చి, ఇతర పంటలు వేయిస్తూ ఆపరేషన్ ‘పరివర్తన్’ కూడా అమలు చేస్తోంది. ఎన్‌సీబీ నివేదికలోని వాస్తవాలివీ...
గంజాయి దందాపై ఉక్కుపాదం మోపడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎన్‌సీబీ వెల్లడించింది. గంజాయి సాగు ధ్వంసం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. దేశంలో 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతోంది. దీని సాగును అడ్డుకోడానికి ఏపీ ఒక్క రాష్ట్రమే ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని వెల్లడించింది. అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను కూడా ఏపీ సమర్థంగా నిరోధిస్తోందని తెలిపింది. ఎన్‌సీబీ నివేదికలోని అంశాలు సంక్షిప్తంగా..
40 శాతం పంట ధ్వంసం ఏపీలోనే..
గంజాయి పంటను ధ్వంసం చేయడంలో 2021లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, త్రిపుర రాష్ట్రాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 27,510 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. అందులో ఒక్క ఏపీలోనే అత్యధికంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. అంటే 40% గంజాయి పంటను ఏపీ పోలీసు శాఖే ధ్వంసం చేసింది.
తరువాతి స్థానంలో ఒడిశా 3,500 ఎకరాలు, జమ్మూ–కశ్మీర్ 3 వేల ఎకరాలు, తెలంగాణ 2 వేల ఎకరాలు, మహారాష్ట్ర 1,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలుకలిపి 5,960 ఎకరాల్లో ఈ పంటను నాశనం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా భారీ స్థాయిలో గంజాయి పంటను పెకలించడంతోనే ఇది సాధ్యపడింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా అంత భారీ ఆపరేషన్ చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి.
అక్రమ రవాణాకు సమర్థంగా అడ్డుకట్ట
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన పాత్ర నిర్వర్తించింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. 2021లో దేశం మొత్తం మీద అక్రమంగా రవాణా అవుతున్న 7.49 లక్షల కిలోల గంజాయిని కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలు జప్తు చేశాయి.
ఇందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సమర్థంగా వ్యవహరించి అత్యధికంగా 2.04 లక్షల కేజీల గంజాయిని జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ కింద సాగు చేçస్తున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు వివిధ మార్గాల్లో సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని అనకాపల్లి సమీపంలో ఒకేసారి కాల్చివేసింది.
ఇంత భారీస్థాయిలో గంజాయిని పట్టుకోవడం, కాల్చివేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏపీ తరువాత స్థానంలో ఒడిశా 1.70 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది. ద్రవ రూపంలో మార్చిన లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఏపీ ఇతర రాష్ట్రాలకంటే ముందుంది. 2021లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అత్యధికంగా 18.14 లీటర్ల హషీష్ ఆయిల్‌ను జప్తు చేసింది.
‘గంజాయి’ నిరోధంలో 'ఏపీ టాప్'
Published Fri, Sep 30 2022 3:53 AM | Last Updated on Fri, Sep 30 2022 8:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment