
మాఫియాపై ఉక్కుపాదం
- గంజాయి స్మగ్లర్లు, మధ్యవర్తుల గుర్తింపునకు ఆరా
- లావాదేవీల ముసుగులో నకిలీ కరెన్సీ చెలామణి
పాడేరు/పెదబయలు: మన్యంలో గంజాయి మాఫియాపై పోలీసుశాఖ దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో గమ్మత్తుగా తరలిపోతున్న దీని నియంత్రణకు నిఘా పెంచింది. జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఏవోబీతోపాటు మారుమూల గ్రామాల్లో సాగు విస్తరించి గంజాయి గుప్పుమంటోంది. పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కొరవడి కొండలన్నీ గంజాయి వనాలుగా మారిపోయాయి. గంజాయి స్మగ్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గతంలో రోలుగుంట ఎస్‌ఐ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. గంజాయి దారిమళ్లింపు కేసులో నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్, ఎస్‌ఐ బదలీ విషయం కూడా తెలిసిందే.
ఇప్పుడు అరకులోయ మీదుగా దీని రవాణా ఎక్కువైంది.రోజుకి రెండు మూడు కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కేసుల వరకు నమోదయ్యాయి. జూలై, ఆగస్టుల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. కోతల అనంతరం ఎండుగంజాయి ఏడాది పొడవునా మన్యం నుంచి రవాణా అవుతుంది. దీని తరలింపులో గంజాయి స్మగ్లర్లతోపాటు మధ్యవర్తులదీ కీలకపాత్రగా ఉంటోంది. పోలీసుల దాడులు, కేసులు ముమ్మరంతో రవాణాకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గంజాయి రవాణాకు యువతను వినియోగిస్తున్నారు. టూరిస్టుల ముసుగులోనూ, ఫ్యామిలీ టూర్ మాదిరిగా తరలిస్తున్నారు. విద్యార్థులు, డ్రైవర్లను దీని ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాను ప్రోత్సహిస్తూ తెరవెనుక ఉండి కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తులపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే గంజాయి లావాదేవీల్లో నకిలీ కరెన్సీ చెలామణి, మావోయిస్టులకు ఆయుధాల పంపిణీ వంటి సంఘటనలు వెలుగు చూడటంతో పోలీసులు ఈ దిశగానూ
నిఘా పెట్టారు.
పెరిగిన పంట విస్తీర్ణం
గతేడాది కంటే దీని సాగు విస్తీర్ణం ఈ ఏడాది బాగా పెరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చిన స్మగ్లర్లు దగ్గరుండి ఈ పంటకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు గిరిజన రైతులకు సరఫరా చేస్తున్నారు. మన్యంలోని వారపు సంతల్లోనూ వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. లాభసాటి పంట కావడంతో మన్యంలోని యువత కూ డా దీని సాగుపైనే దృష్టి పెడుతున్నారు.
సాగును నియంత్రిస్తాం
ఏజెన్సీలో గంజాయి సాగు నియంత్రణపై దృష్టిపెట్టాం. గతేడాది 100 ఎకరాల వరకు గంజాయి తోటలను ధ్వంసం చేశాం. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్మగ్లర్లు సాగును ప్రోత్సహిస్తున్నారు. స్మగ్లర్ల నుంచి డబ్బు తెచ్చి గిరిజనులకు ఇస్తున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగుప్రాంతాలను జియోలాజికల్ సర్వేతో గుర్తిస్తున్నాం. గిరిజన రైతులను కాఫీ, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించి గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. సాగు, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తుల ఆట కట్టించడంపై దృష్టి పెడుతున్నాం. - అట్టాడ బాబూజీ, ఏఎస్పీ, పాడేరు.