సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లో గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.
అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.
ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్‌డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.
ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.
వైద్యంలో గంజాయి వాడకం..
గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్‌లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్‌ఎస్‌డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.
అమెరికాలో ఇలా..
ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment