4 స్థానాలకు రేపు పోలింగ్
అన్నీ బీజేపీ సిట్టింగ్ స్థానాలే
గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్
హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.
కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్‌పూర్ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్ సింగ్ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి...
కాంగ్రా
ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.
సిమ్లా
2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సురేశ్ కుమార్ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని
కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.
మండి
2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.
హమీర్‌పూర్
కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్ కొడుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.
ప్రధానాంశాలు
→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది.
→ పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్ గుర్తు చేసింది.
→ బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
→ కాంగ్రా, హమీర్‌పూర్ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు.
→ వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి.
→ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment