గంజాయి.. ఎక్కడో ఏజెన్సీ ఏరియాలోనో, దట్టమైన అటవీ ప్రాంతంలోనో, కొన్ని రకాలైన పంటల మధ్యనో దొంగచాటుగా సాగు చేస్తారని ఇప్పటిదాకా తెలుసు! కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే దర్జాగా గంజాయి సాగు మొదలెట్టేశాడు! పూల కుండీలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గంజాయి మొక్కలు ఏపుగా పెరగడానికి ప్రత్యేకంగా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన ఇతడు.. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం చేసేందుకు పథకం వేశాడు. ఇంతలోనే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినట్లు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. నగరంలో ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.