![‘మావో’ల కోటలో గంజాయి తోటలు.! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81415569162_625x300.jpg.webp?itok=_g5Svmkl)
‘మావో’ల కోటలో గంజాయి తోటలు.!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మావోయిస్టులే. రెండోది గంజాయి సాగు. అందాలకు నిలయమైన విశాఖ మన్యం దీనికి వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో ఏజెన్సీ అంతటా గంజాయి వాసనలు గుప్పుమంటున్నాయి. ఏవోబీ దాటి ఇతర రాష్ట్రాలకు ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరుపుతున్నా...నెలకు రూ. 10 కోట్లు వంతున ఏటా సుమారు రూ. వంద కోట్లుపైనే ఈ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా.
ఖాకీలు దూరని కారడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతోంది. సీలేరు నదీపరీవాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తునపెంచుతున్నారు. జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు,ముంచంగిపుట్టులతో పాటు ఏవోబీలోనూ పెంపకం అధికంగా ఉంది. ఇవన్నీ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడం విశేషం. ఆగస్టు నెలాఖరు నుంచి కోతలు చేపట్టి, ఎండబెట్టిన గంజాయి రవాణాకు సిద్ధమైందన్న వాదన వ్యక్తమవుతోంది. అదే రీతిలో గంజాయి తోటల పెంపకం సీజన్ ప్రారంభమైంది. ఈ పనిని దగ్గరుండి అంతరరాష్ర్ట వ్యాపారులు చేపడుతున్నారు.
తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కొందరు ఏజెన్సీలో తిష్టవేసి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే గంజాయి తోటల పెంపకం దారుల నుంచి మావోయిస్టులు డబ్బులు గుంజుతున్నారంటూ పోలీసులు ప్రచారం మొదలుపెట్టడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లోనే గంజాయి సాగవడం ఇందుకు తార్కాణమని పోలీసులంటున్నారు.బలమైన అండ లేకుండా స్మగ్లర్లు అక్రమ రవాణా చేయలేరు. పోలీసులు చెబుతున్నట్లు వ్యాపారులకు అండ మావోయిస్టులేనా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా వేడి పుట్టిస్తోంది.
ఇతర రాష్ట్రాలకు తరలింపు
వేలాది ఎకరాల్లో ఏజెన్సీలో పండించిన గంజాయిని పాడేరు, చింతపల్లి, సీలేరు, అరకుఘాట్‌ల నుంచి మైదాన ప్రాంతాల మీదుగా హైదరాబాద్‌తో పాటు గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు.
రూ.వంద కోట్ల టర్నోవర్
గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ గిరాకీ ఉంది. కిలో రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. ముఖ్యంగా శీలావతి రకం కాసులు కురిపిస్తుంది. దీంతో సంప్రదాయ పద్ధతులను వీడి ఆధునిక పద్ధతుల్లో పెంపకం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. ఈ విధంగా పండించిన గంజాయి ఏటా దాదాపు రూ.100 కోట్ల పైగానే టర్నోవర్ అవుతోంది. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు గంజాయి తోటల పెంపకంపై దృష్టి సారించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. అరకొర చెల్లింపులు వారికి ఇచ్చి వీరు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.
అన్నలపై బురద జల్లుతున్నారా?
గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టడంలో పోలీసులు పెద్దగా పురోగతి సాధించలేకపోతున్నారు. నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపకుంటున్నారు. గంజాయి వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్న వారు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే మావోయిస్టులపై బురదజల్లుతున్నారని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి.
గంజాయి వ్యాపారులను మావోయిస్టులు బెదిరించి డబ్బులు గుంజుతున్నారని, ఇది ఉద్యమ సిద్ధాంతం ఎలా అవుతుందని పోలీసులు ఇటీవల ఏజెన్సీలో పోస్టర్లు అతికించడంతో పాటు ఉన్నతాధికారులు ప్రకటనలు కూడా విడుదల చేశారు. ఇప్పటికే అన్నలకు గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం ముమ్మరం చేయగా తాజాగా అక్రమ వసూళ్లు, వ్యాపారాలకు అండ వంటి ప్రచారాాలతో మావోయిస్టులపై పోలీసులు ముప్పేట దాడి ప్రారంభించారు. ఇంతకాలం తుపాకీలతో వారిని నేరుగా ఎదుర్కొన్న ఖాకీలు ఇప్పుడు మావోయిస్టుల మనోస్ధైర్యాన్ని దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి.