
మన్యంపై గంజాయి పడగ
పాడేరు : ఈ ఏడాది కూడా మన్యంలో భారీగా గంజాయి సాగు చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా సహా విశాఖ జిల్లా మైదాన ప్రాంతాలకు చెందిన గంజాయి వ్యాపారులు మన్యంలో తిష్ట వేశారు. గంజాయి సాగును ప్రోత్సహించేం దుకు కుగ్రామాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో వ్యాపారులు మారుమూల గిరిజనులతో చర్చలు జరుపుతున్నారు.
యథేచ్ఛగా రవాణా
గత ఏడాది కూడా భారీస్థాయిలో గంజాయి సాగు చేసి రూ.కోట్లలో వ్యాపారం చేశారు. జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసు దాడులు జరిగినా వేర్వేరు మార్గాల్లో తమిళనాడు, కేరళ, గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. కొన్నిసార్లు పట్టుబడినా అధిక శాతం సరకును తమ ప్రాంతాలకు సులభంగానే తరలించారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లను కూడా అనుకూలంగా మార్చుకున్నారు. కూలీల సాయంతో అడవి మార్గాల్లో గంజాయిని మోయించి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారుల ముఠా సభ్యులు పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఉన్నారు. వ్యాపారం బాగా కలిసి రావడంతో భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేయిస్తున్నారు.
వారం రోజులుగా గంజాయి వ్యాపారుల సంచారం అధికమైంది. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండల కేంద్రాల్లో కూడా మకాం వేసి సాగును ప్రోత్సహిస్తున్నారు. పాడేరుకు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా సాగులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటా భారీస్థాయిలో సాగు చేస్తున్నా తోటల ధ్వంసానికి పోలీసు, ఎక్సయిజ్ శాఖలు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చోద్యం చూస్తున్న రెవెన్యూ, అటవీ శాఖలు
గంజాయి నిర్మూలన బాధ్యత ఎక్సయిజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖలదే. ఏజెన్సీలో కాస్తోకూస్తో ఎక్సయిజ్, పోలీసుశాఖలే దాడులు జరుపుతున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బందికి ఎక్కడ సాగవుతోందో తెలిసినా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు అన్ని శాఖలను సమన్వయపరచాలని, మాఫియా అక్రమాలను నిరోధించాలని గిరిజనులు కోరుతున్నారు.