గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లిలో గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న గిరిజనులు
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు.
మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్‌మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment