Cannabis transportation
-
గంజాయి నిర్మూలనకు గిరిజనుల ప్రతిన
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్‌మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గంజాయి సాగు, రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చత్తీస్‌గఢ్, ఏఓబీలోని దండకారణ్యం నుంచి గంజాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు తేలింది. దీంతో సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేసి, నిత్యం తనిఖీలతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లా పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 78 హాట్స్పాట్లను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో డేగ కన్నుతో నిఘా వేయనున్నారు. ఇక్కడ గంజాయి రవాణాకు బ్రేక్ వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మత్తు దందాకు చెక్ పెట్టనున్నారు. ఇక తనిఖీలు ముమ్మరం ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టుబడిన గంజాయి అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గంజాయి దందా రూ.కోట్లకు చేరింది. బుధవారం గంజాయిపై జరిగిన సమీక్షలో సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం, చర్ల, చింతూరు, బూర్గంపాడు దారిలో, పాల్వంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు, మధిర, సత్తుపల్లి, బోనకల్, కామేపల్లి మండలాల్లో ఇకపై నిత్యం తనిఖీలు చేపట్టనున్నారు. దండకారణ్యం గంజాయి వనం ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుక్మా, దంతెవాడ, ఖాంఖేడ్, బీజాపూర్, మల్కాన్‌గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతోంది. అత్యధికంగా మల్కాన్‌గిరి జిల్లాలోనే గంజాయి సాగు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి ఆదివాసీలతో దళారులు కొన్నేళ్లుగా గంజాయి సాగు చేయిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇది మరింత పెరిగింది. ఇక్కడ సాగు చేసిన గంజాయి ఎండబెట్టిన తర్వాత ప్యాకింగ్ చేసి మల్కాన్‌గిరి నుంచి సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం చేరుస్తారు. అలాగే దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి కుంట మీదుగా భద్రాచలానికి సరఫరా అవుతుంది. 24 గంటలు తనిఖీలు.. గంజాయి రవాణా, అమ్మకాలు, సాగుపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులకు తోడు పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. హాట్స్పాట్లలో నిరంతర నిఘా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 24 గంటలు తనిఖీలు ఉంటాయి. –విష్ణు ఎస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం -
రవాణా శాఖలో నిద్రపోతున్న నిఘా!
గంజాయి రవాణాకు విజయనగరం జిల్లా స్వర్గధామంగా మారుతోంది. అటు ఒడిశా... ఇటు విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే కచ్చితంగా ఈ జిల్లాను దాటిపోవాల్సిందే. ఇక్కడ పేరుకు చెక్‌పోస్టులున్నా.. తనిఖీలు నామమాత్రమే. అందుకే అంతా ఈ మార్గాన్నే రవాణాకు ఎంచుకుంటారు. ఇక్కడి అధికారులను మచ్చిక చేసుకుంటే ఎంత పెద్ద మొత్తంలోనైనా సరకు దర్జాగా దాటించేయొచ్చు. ఇదే అదనుగా కొందరు జిల్లావాసులు సైతం ఈ వ్యాపారంవైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రమాదాల్లో వాహనాలు బోల్తాపడినప్పుడో... మరేదో సందర్భంలోనో... గంజాయి రవాణా గుట్టు రట్టవుతున్నా... మిగతా సమయాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారుల సహకారంతో తరలిపోతూనే ఉంటుంది. సాక్షి, విజయనగరం : ఒడిశా రాష్ట్రం నుంచి, విశాఖ అటవీప్రాంతం నుంచి విజయనగరం మీదుగా వివిధ ప్రాంతాలకు దర్జాగా గంజాయి అక్రమ రవాణా చేసేస్తున్నారు. ఈ అక్రమ రవాణా గురించి తెలిసినా జిల్లా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ప్రమాదాల్లో మాత్రమే ఈ విషయం గుట్టు రట్టవుతోంది. ఇటీవల కొందరు యువకులు ప్రయాణిస్తున్న వాహనం కొత్తవలస మండలంలో ప్రమాదానికి గురయింది. ఆ సందర్భంలో ఆ వాహనంలో గంజాయి లభ్యమైంది. రెండు రోజుల క్రితం మరోచోట వాహనం బోల్తా పడింది. దానిలోనూ గంజాయి బస్తాలు బయటపడ్డాయి. తాజాగా తన పంట చేను పక్కన కళ్లంలో గంజాయి బస్తాలున్నాయని ఓ రైతు పోలీసులకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో తప్ప అధికారులు స్వతహాగా దాడులు చేస్తున్న ఉదంతాలు నామమాత్రంగానే ఉన్నాయి. స్మగ్లర్లతో పోలీస్, జీసీసీ, రెవె న్యూ, ఎక్సైజ్ శాఖలోని కొందరు సిబ్బంది సత్సంబంధాలు కలిగిఉండటం వల్లనే అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పావులుగా మారుతున్న యువత గంజాయిని ఖరీదైన కార్లు, ఆటో రిక్షాలు, టూ వీలర్లు, బస్సులు, లారీల్లోనూ, చింతపల్లిలోని సీలేరు, ముంచింగ్‌పుట్టులో మాచ్‌ఖండ్ నది ద్వారా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీని కోసం గిరిజనులు, యువత, విద్యార్థులను కొరియర్లుగా వాడుకుంటున్నారు. వాహనాల్లో గంజాయి రవాణాకు ప్రత్యేక మార్పులు చేస్తున్నారు. ఇలా విజయనగరం మీదుగా నిత్యం రూ.లక్షల విలువ చేసే గంజా యి, విలువైన అటవీ ఉత్పత్తులు, కలప యథేచ్ఛగా అక్రమంగా రవాణా అవుతోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగంలో ఎక్కడా చలనం ఉండటం లేదు. జిల్లా పరిధిలో విశాఖ–అరుకు రోడ్డులో బొడ్డవరలో ఉన్న చెక్‌పోస్ట్ అక్రమ వ్యాపారాలకు అడ్డాగా ప్రసిద్ధిగాంచింది. అరుకు, అనంతగిరి, పాడేరు, డుంబ్రిగూడ మండలాల నుంచి వచ్చే వాహనాలు బొడ్డవర చెక్‌పోస్ట్ దాటి జిల్లాలోకి రావాలి. ఎప్పుడైనా సమాచారం ఉంటేనే స్థానిక ఎక్సైజ్, పోలీస్ శాఖలు దాడులు చేస్తున్నాయి. మిగతా సందర్భాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. -
కారు పంక్చర్..చూస్తే రూ.కోటి విలువ గల..
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : కారులో తరలిస్తున్న 242 కిలోల గంజాయి నిల్వల్ని స్థానికుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన యడ్లపాడులో శుక్రవారం జరిగింది. తెల్లవారుజాము సుమారు 5.30 గంటల మధ్యలో కారు టైరు పగలడంతో గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్రిక్స్ తయారీ ప్రాంగణంలో దానిని గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఆ కారును గమనించిన బ్రిక్స్ కంపెనీ కార్మికులు ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీయాలని, తమ ట్రాక్టర్ వస్తుందని చెప్పారు. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ బ్యాగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారిని కొద్దిదూరం వెంబడించారు. బోయపాలెం మెయిన్ సెంటర్‌వైపు వెళ్లిన ఇద్దరు కనిపించలేదు. దీంతో అనుమానంతో కారులో పరిశీలించగా ప్యాక్ చేసిన గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. యడ్లపాడు ఎస్ఐ జె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. గంజాయి నిల్వలు కనిపించడంతో క్రేన్‌ను తెప్పించి కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎక్సైజ్ సీఐ బి.లత, ఎస్ఐలు ఎస్ఐ జె.శ్రీనివాస్, షరీఫ్ కారులోని గంజాయ్ ప్యాకెట్లను బయటకు తీయించారు. 121 ప్యాకెట్లలో గంజాయి కారులోని వెనుక సీటు, కింద, వెనుక డిక్కీభాగంగా మొత్తం 121 ప్యాకెట్లలో ఉన్న 242 కిలోల గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారు రాజమండ్రి నుంచి చైన్నె వైపు వెళ్తోందని పోలీసులు భావిస్తున్నారు. తమ పరిధిలో స్థానికుల ద్వారా పట్టుబడిన కారును మంగళగిరి పోలీసులు వెంబడించారని, అంతేకాకుండా వారు గంజాయి నిల్వలున్న మరోకారుతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీంతో తాము స్టేషన్‌కు తరలించిన కారు, గంజాయి నిల్వల్ని మంగళగిరి పోలీసులకే అప్పగిస్తున్నామని ఎస్ఐ జె.శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. కారుటైర్ పగలడంతో పట్టుబడ్డారు... గుంటూరు వైపు నుంచి హైవే పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో దారి తప్పించి 16వ నంబర్ జాతీయ రహదారిలోకి ప్రవేశించిన గంజాయి లోడు కారు విశ్వనగర్ నగర్ వద్ద పోలీసుల తనిఖీలను గమనించి సర్వీసురోడ్డులోకి దిగి నేరుగా అదేమార్గంలో వెళ్లకుండా అండర్‌పాస్ వంతెన కిందగా అవతలి వైపు రోడ్డులోకి వెళ్లారు. బోయపాలెం దాటి వంకాయలపాడు క్వారీ రోడ్డు సమీపంలో సర్వీసు రోడ్డుపై కంకరరాళ్లు ఎక్కువగా ఉండటంతో కారు ముందు టైర్ పగిలింది. కారుటైరుకు పంక్చర్ వేయించుకోవడానికి తిరిగి వంకాయలపాడు అండర్‌పాస్ వంతెన కిందుగా బోయపాలెం వైపు వెనక్కు తిప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గ్రామం ప్రారంభంలోనే ఉన్న బ్రిక్స్ కంపెనీ లోనికి పోనిచ్చారు. బ్రిక్స్ లోడింగ్‌కు వచ్చే ట్రాక్టర్లకు అడ్డొస్తుందన్న భావనతో కారును పక్కకు పెట్టాలని కార్మికులు గట్టిగా చెప్పడంతో భయపడ్డ కారులోని వ్యక్తులు తమ బ్యాగుల్ని తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గంజాయి ముఠా హల్చల్ మంగళగిరి : గంజాయి ముఠా దాష్టీకానికి తెగబడింది. విశాఖ మన్యం నుంచి చెన్నైకు శుక్రవారం ఉదయం కారులో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు ముఠాను పట్టుకునేందుకు మండలంలోని కాజ టోల్గేట్ వద్ద మాటు వేశారు. వాహనం టోల్గేట్ వద్దకు రాగా అధికారులు తనిఖీ చేసేందుకు యత్నిస్తుండగా.. డ్రైవర్ వేగంగా వెళ్లి టోల్గేట్ వద్ద అడ్డుగా ఉంచిన ఇనుప కడ్డీని ఢీకొట్టి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుంటూరు, చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యడ్లపాడు వద్ద వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనానికి పైలెట్‌గా ఉన్న మరో ముఠా కారును కాజ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితుల్ని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి మాచ్‌ఖండ్–లమతాపుట్ మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. లమతాపుట్, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, మొదలగు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. మాచ్‌ఖండ్, లమతాపుట్, జోళాపుట్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ జరుపుతుండగా లమతాపుట్–మాచ్‌ఖండ్ మార్గంలో సిందిపుట్ నదీ ఘాట్ వద్ద కొంతమంది గంజాయి తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆ సయంలో పోలీసులు అటువైపు రావటం చూచిన వారు గంజాయిని, వాహనాన్ని వదిలిపెట్టి పరారీ అయ్యారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీన పరచుకొన్నారు. మాచ్‌ఖండ్ తహసీల్దార్, మెజిస్ట్రేట్ కర్ణదేవ్ సమర్ధర్, నందపూర్ ఎస్డీపీవో శివరాం నాయిక్ సమక్షంలో తూయగా 40 క్వింటాళ్ల 40 కేజీలు ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో మాచ్‌ఖండ్ పోలీసు అధికారి తపన కుమార్ నాహక్, జోలాపుట్ పోలీసు అధికారి మహేశ్ కిరిససాని, లమతాపుట్ పోలీసు అధికారి శివప్రసాద్ షొడంగి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
850 కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం టౌన్: తరలించడానికి సిద్ధంగా ఉన్న 850 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రావు తెలిపారు. రోలుగుంట మండలం రత్నంపేట శివారులో నిల్వచేసిన గంజాయిని స్వాధీనం చేసుకొని ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న చింతపల్లి మండలం గదబారి గ్రామానికి చెందిన కొర్రా రాజు, పాంగి లింగయ్య, గెమ్మిలి మహేష్, జీకె.వీధి మండలం ఇంద్రనగర్‌కు చెందిన వంతల సుబ్బారావు, చింతపల్లి మండలం బోడుజు గ్రామానికి చెందిన వంతల వెంకటరరావు, కొర్రా రూపా, కొర్రా చిన్నారావును అరెస్టు చేశామన్నారు. గంజాయి తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు శనివారం సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, గంజాయి పట్టుబడిందన్నారు. దీనివిలువ రూ. కోటి ఉంటుందని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైలు నివాసరెడ్డి, బసంతీ, సిబ్బంది బొంజన్న తదితరులు పాల్గొన్నారు. గొలుగొండలో 200 కిలోలు గొలుగొండ: మండలంలో పోలవరం ప్రాంతంలో 200 కిలోల గంజాయిని గొలుగొండ ఎస్.ఐ జోగారావు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పోలవరం గ్రామానికి చెందిన జి. సత్తిబాబు ట్రాక్టర్లో పిక్కరాయి మాటున గంజాయి తరలిస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ వెంకటరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.