850 కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం టౌన్: తరలించడానికి సిద్ధంగా ఉన్న 850 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ జగన్‌మోహన్‌రావు తెలిపారు. రోలుగుంట మండలం రత్నంపేట శివారులో నిల్వచేసిన గంజాయిని స్వాధీనం చేసుకొని ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.
గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న చింతపల్లి మండలం గదబారి గ్రామానికి చెందిన కొర్రా రాజు, పాంగి లింగయ్య, గెమ్మిలి మహేష్, జీకె.వీధి మండలం ఇంద్రనగర్‌కు చెందిన వంతల సుబ్బారావు, చింతపల్లి మండలం బోడుజు గ్రామానికి చెందిన వంతల వెంకటరరావు, కొర్రా రూపా, కొర్రా చిన్నారావును అరెస్టు చేశామన్నారు. గంజాయి తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు శనివారం సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, గంజాయి పట్టుబడిందన్నారు. దీనివిలువ రూ. కోటి ఉంటుందని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైలు నివాసరెడ్డి, బసంతీ, సిబ్బంది బొంజన్న తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండలో 200 కిలోలు
గొలుగొండ: మండలంలో పోలవరం ప్రాంతంలో 200 కిలోల గంజాయిని గొలుగొండ ఎస్.ఐ జోగారావు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పోలవరం గ్రామానికి చెందిన జి. సత్తిబాబు ట్రాక్టర్‌లో పిక్కరాయి మాటున గంజాయి తరలిస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ వెంకటరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.