గతంలో గంజాయి సాగుతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా నుర్మతి సమీపంలోని కొండ ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు ఇలా వరి పంటతో కళకళలాడుతోంది.
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది.
(ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది.
ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్‌ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది.
జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు
ఆపరేషన్ పరివర్తన్ ఇలా..
► స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది.
► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు.
► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది.
► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు.
ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ
► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది.
► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్‌మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది.
► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు.
► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు
పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు
► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు.
► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు.
► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు.
► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు.
► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు.
► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి.
దేశంలోనే తొలిసారి
గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది.
– కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ
గిరిజనుల జీవితాల్లో వెలుగు
గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.
– జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా
రాగులు పంట వేశాను
ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం.
– పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి
మా బిడ్డల భవిష్యత్ కోసమే
మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం.
– బేతాయమ్మ, రైతు, వాకపల్లి
ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు
మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి.
– లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి
ఈ–క్రాపింగ్ చేస్తున్నాం
ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్
Comments
Please login to add a commentAdd a comment