నరికివేసిన గంజాయి మొక్కలకు నిప్పు పెట్టిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ షమీర్, ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment