ఆదివాసీలకు అక్షర జ్ఞానం అందిస్తున్న బీసీహెచ్‌సీ
రోజూ అడవుల్లో కిలోమీటర్ల దూరం వెళ్లి పాఠాలు
ములుగు, భూపాలపల్లి జిల్లాలో అక్షర యజ్ఞం
వీరి సేవలపై రీచింగ్ ది అన్‌రీచ్‌డ్ పేరుతో డాక్యుమెంటరీ
జోద్‌పూర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఇక వారి పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదనే చెప్పాలి.
తరతరాలు ఆదివాసుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయని కలత చెందిన కొందరు యువకులు.. వారికి అక్షర జ్ఞానం అందించాలని సంకల్పించారు. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ (బీసీహెచ్‌సీ) పేరిట చిన్న సంస్థను నెలకొల్పి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.
దీనిని గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఈఎంఆర్‌సీ డైరెక్టర్ రఘుపతిరావు.. ఆ సంస్థ సేవలపై డాక్యుమెంటరీ నిర్మించారు. దీనికి యూజీసీ ఆధ్వర్యంలో జోధ్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి లభించింది. - సాక్షి, హైదరాబాద్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో జీవించే ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు. రాళ్లు రప్పల దారుల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. వారి భాష, వేషం, నమ్మకాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలను స్కూల్‌కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బయటి వ్యక్తులను కనీసం నమ్మరు కూడా. అలాంటివారికి విద్యాబుద్ధులు నేర్పుతోంది బీసీహెచ్‌సీ.
సంతోష్ ఈస్రం అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సంస్థ. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన.. తమ ఉద్దేశాన్ని ఆ గిరిజనులకు వివరించి ఒప్పించడానికే రెండున్నర నెలల పాటు కష్టపడ్డారు. వారి భాష కూడా నేర్చుకున్నారు. పిల్లలను బడికి రప్పించేందుకు రోజూ కోడిగుడ్లు ఇచ్చారు. అలా వారితో కలిసిపోయి నెమ్మదిగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు.
చివరికి 2020 జూన్ 23న బీసీహెచ్‌సీ పేరుతో సంస్థను స్థాపించారు. తాడ్వాయి మండలంలోని నీలంగోతు అనే చిన్న పల్లెలో గుడిసె కట్టి అందులో 10 ఏళ్ల లోపు ఉన్న 45 మంది చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.
కొండ కోనల్లో నడిచి..
నీలంగోతులో పాఠశాల విజయవంతం కావడంతో భూపాలపల్లి జిల్లాల్లోని బండ్లపహాడ్, సారలమ్మగుంపు, తక్కెళ్లగూడెం, ఐలాపురం, ప్రాజెక్ట్ నగర్, కల్వపల్లి, దండుపల్లి, ముసలమ్మ పెంటలో గుడిసె బడులు తెరిచి ఒక్కో టీచర్‌ను నియమించారు.
వాళ్లు రోజూ ఏకంగా 10 నుంచి 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరితో పాటు అనేకమంది వలంటీర్లు ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పిల్లలకు చదువు చెప్పేందుకు వీలుగా ఒకచోట పక్కా భవనం నిర్మించింది.
డాక్యుమెంటరీకి అవార్డు..
భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘుపతి.. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉండి, పిల్లల స్థితిగతులు.. టీచర్ల కృషిని చూసి ముగ్ధుడయ్యారు. ‘రీచింగ్ ది అన్‌రీచ్‌డ్’పేరిట డాక్యుమెంటరీ తీశారు.
తాజాగా రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డెవలప్‌మెంట్ కేటగిరీలో దీనికి బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు లభించింది. అలాగే మానవ హక్కుల కేటగిరీలో కూడా స్క్రీనింగ్‌కు ఎంపికైంది. దీనికి వచి్చన రూ.50 వేల నగదు బహుమతిని ఆయన బీసీహెచ్‌సీకే అందజేశారు.
ఎంతో కష్టపడాల్సి వచ్చిoది..
ఆదివాసుల కష్టాలు కళ్లారా చూశాను. నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి వచ్చాను. వాళ్ల గూడేల్లోకి వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి వారికి చదువుకోవటం అనేది చాలా పెద్ద విషయం.
తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు నేర్పించేందుకు సుముఖత చూపించరు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించి బడి వరకు రప్పించాం. మా సంస్థపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. –సంతోష్ ఈస్రం, భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వ్యవస్థాపకుడు
Comments
Please login to add a commentAdd a comment