► మణికొండలో తన ఫ్లాట్‌లోనే సాగు చేస్తున్న ఘనుడు
► ప్లాస్టిక్ గ్లాసుల్లో విత్తనాలు.. మొలకెత్తగానే పూల కుండీల్లోకి..
► మొక్కలు ఏపుగా పెరిగేందుకు ప్రత్యేక లైట్లు, ఫ్యాన్లు
► విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అమ్మేందుకు పథకం
► అమెరికాలోని తన మిత్రుడి ద్వారా ‘సాగు’ మెళకువలు
► గంజాయి అమ్మబోతూ పోలీసులకు చిక్కిన నిందితుడు
► విచారణలో విషయం తెలుసుకొని అవాక్కయిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: గంజాయి.. ఎక్కడో ఏజెన్సీ ఏరియాలోనో, దట్టమైన అటవీ ప్రాంతంలోనో, కొన్ని రకాలైన పంటల మధ్యనో దొంగచాటుగా సాగు చేస్తారని ఇప్పటిదాకా తెలుసు! కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే దర్జాగా గంజాయి సాగు మొదలెట్టేశాడు! పూల కుండీలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గంజాయి మొక్కలు ఏపుగా పెరగడానికి ప్రత్యేకంగా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన ఇతడు.. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం చేసేందుకు పథకం వేశాడు. ఇంతలోనే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినట్లు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. నగరంలో ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
‘ఫ్రెష్ మాల్’తో ఎక్కువ లాభం వస్తుందని...
గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సయ్యద్ షాహెద్ హుస్సేన్ వైకే రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. గంజాయి సేవించడం అలవాటు ఉన్న ఇతడు కొన్నాళ్లకు విక్రేతగా మారాడు. నగరానికి సమీపంలోని తాండూరులో కేజీ రూ.3,500 చొప్పున గంజాయి ఖరీదు చేసుకొని వచ్చి.. ఇక్కడ రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రయ విక్రయాల నేపథ్యంలో హుస్సేన్‌కు మూడు నెలల క్రితం గంజాయి సాగు ఆలోచన వచ్చింది. ఎక్కడో పండించిన గంజాయి.. ఎన్నో రోజుల తర్వాత తీసుకువచ్చి విక్రయిస్తున్నా లాభం వస్తోందని, అలాగాకుండా తానే పండించి ‘ఫ్రెష్ మాల్’ను విక్రయిస్తే మరింత లాభాలు పొందచ్చని భావించాడు. ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టి ఫ్లాట్‌నే పొలంగా మార్చేశాడు.
అమ్మబోతూ చిక్కడంతో గుట్టురట్టు
హుస్సేన్ ఇలా ఇప్పటికే తన ఫ్లాట్‌లోని హాలు, లివింగ్ ఏరియా, కారిడార్‌ల్లో 40 కుండీల్లో గంజాయి సాగు చేశాడు. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత నగరంలోని విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ లోపు ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని విక్రయించడం కొనసాగించాడు. ఇటీవల కొన్న 8.6 కేజీల గంజాయిని అమ్మడానికి సోమవారం గోల్కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడిని విచారించగా.. ఫ్లాట్‌లో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది.
అమెరికా నుంచి వీడియోలు..
ఇంట్లోనే గంజాయి సాగు విషయాన్ని అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడైన గరిత్ క్రిస్టోఫర్‌కు హుస్సేన్ చెప్పాడు. అప్పటికే అక్కడ తన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో గంజాయిని పండిస్తున్న క్రిస్టోఫర్... సాగు విషయాలు హుస్సేన్‌కు చెప్పడంతో పాటు కొన్ని వీడియోలనూ పంపించాడు. వాటి ఆధారంగా గంజాయి సాగుకు అవసరమైన పూలకుండీలు తదితరాలను హుస్సేన్ స్థానికంగా కొన్నాడు. తన ఫ్లాట్‌లోనే మొక్కల్ని పెంచేందుకు తాండూరు పరిసరాల నుంచే గంజాయి విత్తనాలను తెచ్చాడు. వాటిని తొలుత డిస్పోజబుల్ గ్లాసుల్లో నాటాడు. కొద్దిగా ఎదిగిన తర్వాత పూలకుండీల్లోకి మారుస్తూ సాగు చేస్తున్నాడు. గంజాయి మొక్కలు బాగా పెరిగేందుకు ప్రత్యేకంగా లైట్లు, గాలి కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేశాడు.
హైడ్రోపోలిక్ సిస్టమ్‌లో సాగు
మణికొండలోని వైకే రెసిడెన్సీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడ గంజాయి పంటను పండించే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయారు. పూలకుండీల్లో ఉన్న ఈ మొక్కలకు పోసిన నీరు వృథా కాకుండా హుస్సేన్.. హైడ్రోపోలిక్ పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఇందులో ‘క్లే పెల్లెట్స్’వాడటంతో అదనపు నీరు కిందకు రాగానే మళ్లీ దాన్నే మరోసారి మొక్కకు సరఫరా చేసే టెక్నాలజీ ఉంటుంది. కొబ్బరిపొట్టు, వేప నూనె వంటి సంప్రదాయ పద్ధతులను కూడా హుస్సేన్ ఈ గంజాయి మొక్కలపై వాడుతున్నాడు. వీటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెంచుతున్న మొక్కలు ఇంకా చిన్నవి కావడంతో.. వాసన రాలేదని, అందువల్లే అంతా సాధారణ మొక్కలుగా భావించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే దర్జాగా ..
Published Tue, Jan 3 2017 3:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement
Advertisement