హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
ఐదురోజుల క్రితం పూర్ణచంద్‌రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్‌రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు.
వేధింపుల వల్లేనా?
కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్‌రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్‌రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment