పోలీసులను దుర్భాషలాడుతున్న టీడీపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు.
అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు.
నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్‌డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు.
2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment