ఇటీవల స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు
సాక్షి, అమరావతి: సారా, గంజాయి దందాను కట్టడి చేయడానికి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) దూకుడు పెంచింది. వారం రోజుల్లోనే విస్తృతంగా దాడులు జరిపి 566 కేసులు నమోదు చేసి 705 మందిని అరెస్టు చేసింది. అలాగే 64 వాహనాలను జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ 2.0 కింద సారా తయారీ, రవాణాపై సెబ్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది.
రాష్ట్ర సరిహద్దులకు అవతల సాగు చేసిన గంజాయిని రాష్ట్రం గుండా అక్రమ రవాణా చేయకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించే దారులను ఇప్పటికే మ్యాపింగ్ చేసి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దోనూరు, చింతూరు, ఇదుగురలపల్లి, లక్ష్మీపురం, మారేడుమిల్లిలతోపాటు అనకాపల్లి జిల్లాలోని తాటిపర్తి, భీమవరం గ్రామాల్లో చెక్ పోస్టులను నెలకొల్పింది.
మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించింది. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. వారం రోజులుగా చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలను అందించిందని సెబ్ వర్గాలు తెలిపాయి. సారా తయారీ, విక్రయాలకు సంబంధించి 560 కేసులు నమోదు చేసి 692 మందిని అరెస్టు చేశారు.
అలాగే 2,940 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు 30 లీటర్ల సారా ఊటను సెబ్ ధ్వంసం చేసింది. 63 వాహనాలను జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 6 కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేశారు. అలాగే 1,009 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక వాహనాన్ని జప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment