Telangana Govt Job Notification 2022: Police Department Is Ready To Replace 18,334 Posts - Sakshi
Sakshi News home page

Telangana Jobs Notification: 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ రంగం సిద్ధం

Published Mon, Mar 14 2022 2:45 AM | Last Updated on Mon, Mar 14 2022 3:01 PM

Telangana Police Department is Ready to Replace 18,334 Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్‌ శాఖనే ముందు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లవుతుంది.

ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.
 
ఇప్పటికే 28,000 పోస్టుల భర్తీ... 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్‌ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ), పోలీస్‌ కమ్యూనికేషన్, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్‌స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.  

స్థానికంగానే అధికం...  
ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్‌ పోస్టులు 60 శాతానికి పైగా లోకల్‌ కేడర్‌లోనే భర్తీ కానున్నాయి. గతంలో పోలీస్‌ శాఖలో నాలుగు రేంజ్‌లు ఉండేవి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం.. 7 రేంజ్‌లు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి.. కొత్త పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ ఆఫీస్‌ల ఏర్పాటుతో స్థానికంగా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్‌ (ఆర్మ్డ్‌ రిజర్వ్‌) కేటగిరీలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ పోలీస్, కమ్యూనికేషన్‌ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్‌ఐ ర్యాంక్‌ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉంటాయి. దీంతో ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, స్థానికత ఆధారంగా జరిగే మొట్టమొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే కావడం గమనార్హం. 

జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లు... 
రాబోతున్న నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేలా ఈ సెంటర్లు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంతో సమన్వయం చేసుకొని ఈ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు ఉండాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లో ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేయడం వేగవంతం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement