సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు.
గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు.
ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment