సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తానని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అక్కడికి రావాలని చాలా మంది ఆహ్వానిస్తున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి భిన్నంగా ఉంది. హోదాతో వచ్చేది లేదు సచ్చేది లేదని చంద్రబాబు గతంలో అన్నారు. ఇప్పుడు ఆయనే హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకే స్పష్టత లేదు. ఇక నేనేం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తా. అక్కడికి రావాలని చాలా మంది ఆహ్వానిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోందని ఆయనీ సందర్భంగా చెప్పారు.
మేనిఫెస్టో 100% అమలు చేశాం..
‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని కేసీఆర్ తెలిపారు. తమ పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తమకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ అమలు చేస్తామన్నారు. హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ధీమా వెలిబుచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార(పరపతి) పెరిగిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 లక్షలమందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు.
‘‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment