మమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు.. | High Court Command to withdraw pill on land acquisition of KCR on Helipad | Sakshi
Sakshi News home page

మమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు..

Published Wed, Mar 13 2019 1:34 AM | Last Updated on Wed, Mar 13 2019 1:34 AM

High Court Command to withdraw pill on land acquisition of KCR on Helipad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో న్యాయస్థానాల్లో ప్రచార ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ఎక్కువైపోయింది. ఎన్నికలు వస్తే చాలు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్‌లకు న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటున్నారు. వీధుల్లో చేయాల్సిన విన్యాసాలను న్యాయస్థానాల్లో చేస్తున్నారు. ఇటువంటి వ్యాజ్యాలను మేం విచారిస్తుండటాన్ని చూస్తూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వ్యాజ్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు. 
    –ప్రధాన  న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం 

సీఎం కె.చంద్రశేఖరరావు కోసం హెలిప్యాడ్‌ నిర్మించేందుకు కరీంనగర్‌ జిల్లా ఆరేపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 232లో ఐదెకరాల భూమిని సేకరిస్తున్నారని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెలిప్యాడ్‌కు అవసరమైన భూమిని సేకరించేందుకు జారీ చేసిన నోటి ఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకు న్నా, తిరిగి పిటిషన్‌ దాఖలు చేయడంలో ఔచిత్యం ఏమిటని పిటిషనర్‌ను నిలదీసింది. వెంటనే ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కనీసం రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీని వల్ల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తీసు కొచ్చిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇటువంటి పనికి రాని వ్యాజ్యాలతో కోర్టుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆక్షేపించింది. పిటిషన్‌ ఉపసంహరణకు రేపటి వరకు గడువునివ్వాలని ఆ న్యాయవాది కోరగా, అలా అయితే రూ.2 లక్షల జరిమానా విధిస్తామనడంతో ఆ న్యాయవాది పిటిషన్‌ ఉపసంహరణకు సంసిద్ధత తెలియచేశారు. దీంతో హైకోర్టు ఆ పిటిషన్‌ను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ హైకోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేయగా మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement