సాక్షి, హైదరాబాద్: జన ధ్రువీకరణపత్రంలో కుల,మత వివరాలు లేకుండా జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం నాచారం గ్రామానికి చెందిన జర్నలిస్టు సందేపు స్వరూప, ఎ.డేవిడ్‌లు దాఖలు చేసిన పిల్‌లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జనన, మరణ ధ్రువీకరణ అధికారి, కొత్తకోట మున్సిపల్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు కుల,మతాలకు అతీతంగా ఇష్టపడి వివాహం చేసుకున్నారని, వారి కుమారుడు ఇవాన్ రూడే జనన పత్రంలో కులమత వివరాలు లేకుండా జారీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు ఎస్.వెంకన్న, డి.సురేశ్‌కుమార్‌లు వాదించారు. గతేడాది మార్చి 23న వారికి కుమారుడు పుడితే ఇప్పటి వరకూ జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదన్నారు.
తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.స్నేహ గతంలో ఇదే తరహాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని, స్థానిక కలెక్టర్ ఆమెకు కుల,మత వివరాలు లేకుండా «సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డి.వి. రామకృష్ణారావు, కృపాళి దంపతులు తమ కుమారుడిని స్కూల్లో చేర్చినప్పుడు ఏమతమో దరఖాస్తులో రాయాలని స్కూల్ యాజమాన్యం పట్టుబట్టిందని, చివరికి హైకోర్టు మందలించిన తర్వాత వారి కుమారుడికి స్కూల్లో సీటు లభించిందని న్యాయవాదులు తెలిపారు. కులం, మతం పట్ల నమ్మకం లేని వారి విశ్వాసాలను కూడా గౌరవించాలన్నారు.
కుల,మత వివరాల్లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి
Published Wed, Apr 29 2020 2:12 AM | Last Updated on Wed, Apr 29 2020 2:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment